YS Sharmila: వెంకటరెడ్డి వెనుక వేల కోట్లు కొల్లగొట్టిన ఆ ఘనుడు ఎవరో అందరికీ తెలుసు: షర్మిల

Sharmila responds on Venkatareddy arrest

  • గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ
  • వెంకటరెడ్డి వంటి తీగలే కాకుండా పెద్ద డొంకలు కదలాలన్న షర్మిల
  • అడ్డగోలుగా సహజ సంపదను దోచుకుతిన్నారంటూ ధ్వజం

గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న గనులశాఖ (ఏపీఎండీసీ) మాజీ ఎండీ వెంకటరెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. 

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గనుల దోపిడీకి సంబంధించి వెంకటరెడ్డి వంటి తీగలే కాకుండా, పెద్ద డొంకలు కూడా కదలాలని పేర్కొన్నారు. ఆ పెద్ద డొంక ఏ ప్యాలెస్ లో ఉన్నా విచారణ జరపాలని స్పష్టంచేశారు. రూ.2,566 కోట్ల దోపిడీకి పాల్పడిన ఘనుడు వెంకటరెడ్డి అయితే, తెరవెనుక ఉండి అన్నీ తానై వేల కోట్లు కొల్లగొట్టిన ఆ ఘనాపాఠి ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని షర్మిల వివరించారు. 

"ఐదేళ్లుగా రాష్ట్రంలో అడ్డగోలుగా సహజ సంపదను దోచుకుతిన్నారు. అస్మదీయ కంపెనీలకు మైనింగ్ కాంట్రాక్టులు ఇచ్చారు... నిబంధనలను బేఖాతరు చేసి వారు అనుకున్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారు. ఎన్జీటీ నిబంధనలను సైతం తుంగలో తొక్కారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన నిధులను సొంత ఖజానాకు తరలించారు. 

గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ స్కాంపై ఏసీబీతో విచారణతో పాటు, సమగ్ర దర్యాప్తు జరిపించాలి. చిన్న చేపలను ఆడించి సొమ్ము చేసుకున్న పెద్ద తిమింగలాన్ని పట్టుకొనేలా దర్యాప్తు జరగాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సహజ వనరులపై దోపిడీపై సీబీఐ విచారణ కోరండి" అంటూ షర్మిల ట్వీట్ చేశారు.

More Telugu News