Vangalapudi Anitha: డిక్లరేషన్ ఇవ్వడానికి జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియడంలేదు: మంత్రి అనిత
![AP Home Minister Vangalapudi Anitha Fires on YS Jagan](https://imgd.ap7am.com/thumbnail/cr-20240928tn66f80591ea091.jpg)
- మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన ఏపీ హోంమంత్రి
- మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ధ్వజం
- ఆయన్ను తిరుమలకు రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని స్పష్టీకరణ
- తిరుమలకు రావద్దని నోటీసులు ఇవ్వలేదన్న మంత్రి అనిత
- తిరుమల వెళ్లే ఇష్టంలేకే పర్యటన రద్దు చేసుకున్నారని వ్యాఖ్య
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఆయన్ను తిరుపతికి రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని, తిరుమలకు రావద్దని నోటీసులు కూడా ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు.
మాజీ సీఎం జగన్ ఇటీవల చాలా జిల్లాల్లో పర్యటించారని గుర్తు చేసిన మంత్రి... ఎక్కడా ఆయన్ను అడ్డుకోలేదని చెప్పారు. శ్రీవారి లడ్డూలో కల్తీ వివాదాన్ని విచారించేందుకు సిట్ ఏర్పాటు చేయడాన్ని జగన్ తప్పుబట్టడం పట్ల అనిత మండిపడ్డారు. గతంలో ఆయన దగ్గర పనిచేసిన పోలీసులే సిట్‌లో ఉన్నారని గుర్తుచేశారు. తప్పు చేయకపోతే విజిలెన్స్ రిపోర్టుపై కోర్టుకు ఎందుకు వెళ్లారని ఆమె నిలదీశారు.
వైసీపీ అధినేతకు తిరుమల వెళ్లే ఇష్టంలేకే ఇలా అర్థాంతరంగా పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి ఆరోపించారు. టాపిక్ డైవర్షన్ కోసమే నోటీసుల గురించి మాట్లాడారని అన్నారు.
జగన్ ఎప్పుడైనా తిరుమల లడ్డూ తిన్నారా? అని మంత్రి అనిత ప్రశ్నించారు. దేవుడి అక్షింతలు వేసిన వెంటనే దులుపుకున్న వ్యక్తి జగన్ అని, వాళ్లు ప్రసాదాన్ని కూడా టిష్యూ పేపర్‌లో పెట్టి పక్కన పడేసే వ్యక్తులు అని విమర్శించారు.
డిక్లరేషన్ ఇచ్చి ఆయంలోకి వెళ్లడానికి జగన్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటో తెలియడం లేదని మంత్రి అనిత అన్నారు. హైందవ సాంప్రదాయాలను ఆయన ఎందుకు గౌరవించడం లేదని మండిపడ్డారు. ఇక జగన్ ఇంతకుముందు ఏర్పాటు చేసిన పాలక మండలిలో ఒక్క దళితుడికి కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. అలాంటి ఆయన ఇప్పుడు ఆలయంలో దళితుల ప్రవేశంపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నేను హిందువును... నీ మతమేంటో ధైర్యంగా చెప్పగలవా? జగన్ అంటూ మంత్రి అనిత ప్రశ్నించారు.