Revanth Reddy: హైడ్రా విషయంలో కోర్టుకు వెళతాం... చూస్తూ ఉరుకునేది లేదు: రేవంత్ రెడ్డికి ఈటల హెచ్చరిక

Etala Rajendar warning to Revanth Reddy

  • హైడ్రా పేరుతో ప్రజలపై దౌర్జన్యం చేస్తే ఊరుకునేది లేదన్న ఈటల
  • బాధితులకు న్యాయం జరిగేలా సీఎం చర్యలు తీసుకోవాలన్న ఎంపీ
  • పేదలపై కనికరం లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు ఉన్నాయని విమర్శ

హైడ్రా విషయంలో అవసరమైతే హైకోర్టుకు వెళతామని, తాము చూస్తూ ఊరుకునేది లేదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హైడ్రా పేరుతో ప్రజలపై దౌర్జన్యం చేస్తే బీజేపీ సామాన్యుల పక్షాన నిలుస్తుందన్నారు. అవసరమైతే లక్షమందితో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. కూల్చివేతల విషయంలో బాధితులకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. పేదల కన్నీటితో ఆడుకుంటే పతనం తప్పదని హెచ్చరించారు.

చైతన్యపురి డివిజన్ న్యూమారుతీ నగర్ మూసీ పరివాహక ప్రాంతంలో ఈటల పర్యటించి, బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందన్నారు. హైడ్రాను నియమించిన రోజే ఇది డ్రామా అని చెప్పానని గుర్తు చేశారు. అధికారుల లెక్కల ప్రకారం చెరువులు, కుంటలు చుట్టూ ఉన్నది ప్రభుత్వ భూమి కాదన్నారు. ఏళ్లుగా ఉన్న పేదల ఇళ్లను కూల్చవద్దని కోరారు.

పేదలపై కనికరం లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. జొన్నలబండ వద్ద ఇందిరాగాంధీ పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని... వాటిని కూల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. మూసీని సుందరీకరణ చేస్తే తమకు ఇబ్బంది లేదని, కానీ ఎన్నడో భూమి కొన్నవారు ఇప్పటికీ ఈఎంఐలు కడుతున్నారని, అలాంటి వారికి నష్టం జరగవద్దన్నారు. లక్షలు పెట్టి కొన్న ఇళ్లకు ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామనడం కరెక్ట్ కాదన్నారు. ఈ ప్రాంతాల్లో ఏనాడూ మూసీ నుంచి వరద నీరు రాలేదన్నారు. ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచిన విషయం మరువవద్దన్నారు.

హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బస్తీ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ మాటలు నమ్మినందుకు ప్రజలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారన్నారు. ఖబడ్దార్ రేవంత్ రెడ్డి... ప్రజలని ఇబ్బంది పెట్టడం మానుకోవాలని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంపై నివేదిక ఇస్తామన్నారు. చట్టాలు, జడ్జీల మీద నమ్మకం లేకుండా రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Revanth Reddy
Etela Rajender
Congress
Telangana
  • Loading...

More Telugu News