India vs Bangalesh: భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియానికి భద్రతగా కొండముచ్చులు... కారణం ఏంటంటే

UPCA authorities have hired Langurs to guard the people against food grabbing monkeys in Kanpur Test

  • కోతుల బెడద వేగలేక కొండముచ్చులను రంగంలోకి దించిన యూపీసీఏ
  • కొండముచ్చులనుచూస్తే సాధారణ కోతులు భయపడి పారిపోతాయంటున్న నిర్వాహకులు
  • ప్రేక్షకుల ఆహార పదార్థాలు, ఫోన్లు ఎత్తుకెళుతున్న కోతులు
  • కొండముచ్చులతో కోతులకు చెక్ 

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు కోతుల బెడద పొంచివుంది. స్టేడియంలో మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన క్రికెట్ అభిమానుల నుంచి ఆహార పదార్థాలు, మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులను ఈ కోతులు లాక్కెళ్తున్నాయి. ఈసారి టెస్ట్ మ్యాచ్ కావడంతో 5 రోజులపాటు ఈ కోతి చేష్టలు భరించలేమని భావించిన ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) అధికారులు సరికొత్త ఉపాయంతో ముందుకొచ్చారు.

ముల్లుని ముల్లుతోనే తియ్యాలి అన్నట్టు కోతులకు కోతులతోనే యూపీసీఏ అధికారులు చెక్ పెట్టారు. కొండముచ్చులను స్టేడియంలో భద్రత కోసం రంగంలోకి దించారు. కొండముచ్చులతో పాటు వాటి నిర్వాహకులను కూడా స్డేడియంలో నియమించారని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’ కథనం పేర్కొంది. స్టేడియంలో పోలీసుల భద్రత ఉన్నప్పటికీ.. మరో అంచె భద్రతగా ఈ కొండముచ్చులు ఉపయోగపడతాయని చెబుతున్నారు.

కోతుల బెడదను నివారించేందుకు కొండముచ్చులను ప్రత్యేకంగా తీసుకొచ్చామని యూపీసీఏ డైరెక్టర్ సంజయ్ కపూర్ చెప్పారు. స్టాండ్స్‌లో కెమెరామెన్లు పనిచేయడం ఇబ్బందికరంగా మారిందని, వారి ఆహారం, పానీయాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆహార పదార్థాలను వానరాలు లాక్కెళ్తున్నాయని కపూర్ వివరించారు. బ్రాడ్‌కాస్టర్ల కెమెరాలు, బౌండరీ రోప్ వద్ద ఉండే తినుబండారాలను కూడా గుర్తించి వస్తున్నాయని, ఆహార పదార్థాలపై నల్లని వస్త్రాలను కప్పాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు.

కొండముచ్చులే ఎందుకు?

ఆహారాన్ని లాక్కునే కోతుల బెదడ నుంచి కొండముచ్చులు తప్పిస్తాయని స్టేడియం నిర్వాహకులు చెబుతున్నారు. ఇవి ఉంటే సాధారణ కోతులు దగ్గరకు రావని, భయపడి దూరంగా పారిపోతాయని వివరించారు. కాగా కొండముచ్చులు పరిమాణంలో కోతుల కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. మూతి నల్లగా, జుట్టు తెల్లగా ఉంటుంది. వీటి అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. తేమతో కూడిన అడవులు లేదా రాతి ప్రాంతాల్లో ఉండడానికి ఇవి ఇష్టపడతాయి. చాలా కోతులు వర్షాలు ఎక్కువగా కురిసే అరణ్యాలలో నివసిస్తాయి. ఇవి ఆకులను ఆహారంగా తీసుకుంటాయి. పండిన కాయలను కాకుండా పచ్చి కాయలను తింటుంటాయి.

  • Loading...

More Telugu News