Raghu Rama Krishna Raju: కస్టడీలో రఘురామను చితకబాదుతూ వీడియో కాల్‌లో సీఐడీ చీఫ్‌కు చూపడం నిజమే.. దర్యాప్తు కొలిక్కి!
- కస్టడీలో రఘురామరాజుకు చిత్రహింసలు నిజమేనని దర్యాప్తు అధికారుల నిర్దారణ
- వీడియో కాల్‌లో చూసిన అప్పటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ కొట్టడం అలా కాదంటూ ముసుగు వ్యక్తులతో కలిసి కార్యాలయానికి
- వాంగ్మూలం ఇచ్చిన పోలీసులు.. అప్రూవర్‌గా మారే అవకాశం
- అప్పటి అధికారుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
- పరారీలో ఉన్న అప్పటి దర్యాప్తు అధికారి విజయ్‌పాల్ కోసం విస్తృత గాలింపు
- గుంటూరు జీజీహెచ్ వైద్యులు ఇచ్చింది తప్పుడు నివేదికేనని వైద్యుల నిర్దారణ
మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు కస్టడీలో చిత్రహింసలు నిజమేనని తేలింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను గుంటూరు పోలీసులు సేకరించారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న రఘురామ కృష్ణరాజుపై రాజద్రోహం కేసు నమోదు చేసి 14 మే 2021న అరెస్ట్ చేసి గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. అప్పట్లో తనను కస్టడీలో చిత్రహింసలు పెట్టారని ఈ ఏడాది జులై 11న గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్, అప్పటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్, నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, దర్యాప్తు అధికారి విజయపాల్, అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చారు. వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని గుంటూరు ఎస్పీ సతీశ్‌కుమార్‌ను కోరారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఏఎస్పీ నియమితులయ్యారు.
దర్యాప్తులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కస్టడీలో రఘురామకు చిత్రహింసలు నిజమేనని అప్పట్లో విధులు నిర్వర్తించిన సీఐ, ఎస్సై, సిబ్బంది వాగ్మూలం ఇచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే రఘురామరాజును కొడుతూ వీడియో కాల్‌లో అప్పటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌కు చూపించామని తెలిపారు. అయితే, కొట్టడమంటే అలా కాదని, కాల్‌కట్ చేసి ఆయన తన సిబ్బందితో కలిసి నేరుగా రఘురామను నిర్బంధించిన గదికి వచ్చి దగ్గరుండి కొట్టించారని తెలిపారు. ఈ కేసులో ఒకరిద్దరు పోలీసులు అప్రూవర్లుగా మారే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
రఘురామను అరెస్ట్ చేసిన రోజు రాత్రి ముఖానికి ముసుగేసుకున్న నలుగురు వ్యక్తులు సునీల్‌కుమార్ కార్యాలయానికి వచ్చారని అక్కడ విధుల్లో ఉన్న సెంట్రీ వాంగ్మూలంలో ఇచ్చారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఆ రోజు రాత్రి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ ఉన్నారా? లేదా? అన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. అప్పటి దర్యాప్తు అధికారి విజయ్‌పాల్ కోసం గాలిస్తున్నారు. విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు పంపినా ఆయన అజ్ఞాతం వీడలేదు. ఆయన దొరికితే విషయాలన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో అప్పటి పోలీసులే ఆయనను దాచిపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.
స్మార్ట్‌ఫోన్ వాడితే లొకేషన్ గుర్తుపట్టే అవకాశం ఉండడంతో కీప్యాడ్ ఫోన్ వాడుతూ ఆయన తప్పించుకు తిరుగుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. రఘురామను చిత్రహింసలకు గురిచేసినా విజయ్‌పాల్ నోరు మెదపకపోవడంతో అందుకు బహుమతిగా ఉద్యోగ విరమణకు కొన్ని రోజుల ముందు ఆయనకు ఏఎస్పీగా ఉద్యోగోన్నతి కల్పించారు. రిటైర్‌మెంట్ తర్వాత కూడా ఓఎస్డీగా తీసుకున్నారు.
ఇక, రఘురామకు పరీక్షలు నిర్వహించిన గుంటూరు వైద్యులపై ఒత్తిడి తెచ్చి ఆయన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని తప్పుడు నివేదికలు ఇప్పించినట్టు తాజాగా గుర్తించారు. అయితే, ఆయన శరీరంపై రక్తపు గాయాలున్నాయని హైదరాబాద్‌లోని సైనిక ఆసుపత్రి అప్పట్లో నివేదిక ఇచ్చింది. తాజాగా విచారణలో అప్పట్లో రఘురామ శరీరంపై గాయాలు ఉండడం నిజమేనని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో కొందరు వైద్యులు తెలిపారు.