Balineni Srinivasa Reddy: నేను జనసేనలోకి వెళ్లడం వల్ల ఒంగోలులో కూటమికి ఎలాంటి ఇబ్బంది రాదు: బాలినేని

Balineni comments after joining Janansena

  • ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని, సామినేని ఉదయభాను, కిలారి
  • నేడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన ముగ్గురునేతలు
  • జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడి 

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అనంతరం ముగ్గురు నేతలు మాట్లాడారు. 

తాను మొదటి నుంచి విలువలతో కూడిన రాజకీయాలు చేశానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. తాను జనసేన పార్టీలో చేరడం వల్ల ఒంగోలులో కూటమికి ఇబ్బంది రాదని స్పష్టం చేశారు. ఇటీవల చిన్న చిన్న వివాదాలు వచ్చాయని, అవన్నీ సర్దుకుంటాయని అన్నారు. ప్రకాశం జిల్లాలో జనసేనను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని బాలినేని పేర్కొన్నారు. 

సామినేని ఉదయభాను స్పందిస్తూ... జనసేన పార్టీతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఎటువంటి షరతులు లేకుండా జనసేన పార్టీలో చేరామని వెల్లడించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరని, కూటమి పార్టీల నేతలతో కలిసి పనిచేస్తామని వివరించారు. 

కిలారి రోశయ్య మాట్లాడుతూ... మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన కావాలని ప్రజలు కోరుకున్నారని తెలిపారు. అందుకే మూడు పార్టీల కూటమికి ఎన్నికల్లో అఖండ విజయం కట్టబెట్టారని వివరించారు. ఐదేళ్ల పాటు ప్రజలు ఇబ్బంది పడ్డారని, అందుకే ఇలాంటి తీర్పు ఇచ్చారని స్పష్టంచేశారు. 

తాము కూడా రాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు పాటుపడతామని పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత అని పవన్ కల్యాణ్ గుర్తుచేశారని వెల్లడించారు. ఇక, గుంటూరు జిల్లాలో జనసేనలోకి వచ్చేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 

More Telugu News