Nara Lokesh: వచ్చే ఏడాది నుంచి ప్రతి క్లాసుకు ఒక టీచర్ విధానం: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh inspects a school in Srikakulam

  • శ్రీకాకుళంలో ఎలిమెంటరీ స్కూలును తనిఖీ చేసిన మంత్రి లోకేశ్
  • టీచర్ గా మారి విద్యార్థులనుంచి సమాధానాలు రాబట్టిన వైనం
  • తొలుత ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వెల్లడి

వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ప్రతి క్లాసుకు ఒక టీచర్ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. శ్రీకాకుళం ఎచ్చెర్ల వీధిలోని మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూలులో మంత్రి నారా లోకేశ్ నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల తరగతి గదులను మంత్రి పరిశీలించారు. పలు ప్రశ్నలు అడిగి విద్యార్థుల చదువు కొనసాగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. 

మీకు ఇష్టమన సబ్జెక్ట్ ఏమిటని ప్రశ్నించినపుడు ఇంగ్లీషు, ఈవీఎస్ సబ్జెక్టులని విద్యార్థులు చెప్పారు. స్కూలులో మధ్యాహ్న భోజనం ఎలా ఉంది? అమ్మా, నాన్న ఏం చేస్తున్నారు? యూనిఫాం, బ్యాగ్స్ బాగున్నాయా? తదితర ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.

విద్యార్థుల వర్క్ బుక్ ను పరిశీలించిన మంత్రి చిన్నారుల హ్యాండ్ రైటింగ్ బాగుందని కితాబిచ్చారు. హ్యాండ్ రైటింగ్ మెరుగుదల కోసం కాపీ రైట్ బుక్స్ రాయిస్తున్నామని టీచర్లు చెప్పగా, వారిని అభినందించారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో ఇదే విధానాన్ని అమలుచేసే అంశాన్ని పరిశీలిస్తామని లోకేశ్ చెప్పారు.

మధ్యాహ్న భోజనంలో స్థానిక ఆహారంపై విద్యార్థులు మక్కువ చూపుతున్నందున, వాటిని మెనూలో చేర్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా అధికారులకు సూచించారు. 

టీచర్ గా మారిన లోకేశ్

స్కూలు తనిఖీ సందర్భంగా మంత్రి లోకేశ్ టీచర్ గా మారి విద్యార్థుల ఐక్యూ టెస్ట్ చేశారు. పలు వస్తువుల పేర్లను ఇంగ్లీషులో అడిగి తెలుగులో సమాధానాలు రాబట్టారు. చిన్నారులు హుషారుగా సమాధానాలివ్వడం, అల్లరి చేస్తూ కేరింతలు కొట్టడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అబ్బాయిలు క్లాస్ రూమ్ తలుపు విరగ్గొట్టారని ఒక బాలిక చెప్పడంతో... మీరు రౌడీల మాదిరి ఉన్నారురా! అంటూ సరదాగా వారితో చమత్కరించారు. చిన్నప్పుడు తాను కూడా అల్లరి చేసేవాడినని చెప్పారు. 

విద్యార్థులకు ఏంకావాలని అడిగినపుడు బెంచీలు కావాలని చెప్పడంతో త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, ముఖ్యంగా అమ్మను బాగా చూసుకోవాలని చెప్పారు. అలాగే చేస్తామంటూ విద్యార్థులు మూకుమ్మడిగా సమాధానమిచ్చారు. విద్యార్థులు తయారుచేసిన ఎగ్జిబిట్స్ బాగున్నాయని అన్నారు.

టీచర్లు, ఎంఈవోతో సమావేశం

తరగతి గదుల పరిశీలన అనంతరం టీచర్లు, ఎంఈవో, స్కూలు సిబ్బందితో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. ప్రభుత్వ స్కూళ్లపై అవగాహన కోసమే తాను ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. 

ఈ స్కూలు నిర్మాణం జరిగి వంద సంవత్సరాలు అయిందని టీచర్లు చెప్పగా, లోకేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్ని తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయని, తామే సొంతంగా రూ.50 వేలు ఖర్చుచేసి చిన్నచిన్న మరమ్మతులు చేయించినట్లు చెప్పారు. నాడు-నేడు ఫేజ్ -1, ఫేజ్ -2 లో తమ స్కూలుకు ఎటువంటి నిధులు విడుదల కాలేదన్నారు. వర్షం వచ్చినపుడు తరగతి గదుల్లోకి నీరు వస్తోందని, మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని కోరారు. 

అందుకు మంత్రి లోకేశ్ స్పందిస్తూ... ప్రభుత్వ స్కూళ్లలో తొలుత కనీస మౌలిక సదుపాయాలు కల్పించి, తర్వాత అన్నింటినీ ఒకేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ స్కూలులో అటెండెన్స్, ఫలితాలు బాగున్నాయని మంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. జీతం సరిగా అందడంలేదని ఆయా చెప్పగా, అటువంటి సమస్య తలెత్తకుండా చూడాలని ఎంఈవోను ఆదేశించారు. 

ప్రమాణాలను మెరుగుదలకు భాగస్వామ్యం వహించండి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలకు కలెక్టర్ నుంచి టీచర్ వరకు అందరూ భాగస్వామ్యం వహించాలని కోరారు. రాబోయే అయిదేళ్లలో దేశంలోనే ఆదర్శంగా ఏపీ స్కూళ్లను తీర్చిదిద్దుతామని తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత చర్యల కారణంగా పలు తప్పులు జరిగాయని, ఈసారి అలాంటివి చోటుచేసుకోకుండా ప్రణాళికాబద్ధంగా సంస్కరణలు అమలు చేస్తామని అన్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులన్నింటినీ ఒకేసారి మార్చడం సాధ్యం కాదని చెప్పారు. స్కూళ్లలోని మౌలిక సదుపాయాల వాస్తవ చిత్రాలను ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డులో అప్ లోడ్ చేయాలని ఎంఈవోను ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసి నాణ్యత పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 

ఈ సందర్భంగా స్కూళ్లలో నాణ్యత పెంచేందుకు టీచర్ల సలహాలు తీసుకున్నారు. సబ్జెక్టులవారీగా బోధనకు స్కూల్ అసిస్టెంట్లు తక్కువగా ఉన్నారని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. ఇటీవల వర్క్ అడ్జస్ట్ మెంట్ ద్వారా కొన్నింటిని సరిచేశామని, వచ్చే ఏడాది మరింత పకడ్బందీగా అమలుచేస్తామని చెప్పారు. 

ఈ పర్యటనలో మంత్రి లోకేశ్ వెంట ఎమ్మెల్యే గొండు శంకర్, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి ఉన్నారు.

  • Loading...

More Telugu News