Kamindu Mendis: శ్రీలంక బ్యాటర్ కమిందు మెండిస్ నయా రికార్డు... 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి

Kamindu Mendis becomes first batter in the 147 year history of Test cricket to score a fifty plus score in his first eight Tests

  • అరంగేట్రం తర్వాత వరుసగా 8 టెస్టుల్లో 50 ప్లస్ స్కోర్లు
  • ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా అవతరణ
  • న్యూజిలాండ్‌పై రెండో టెస్టులో అర్ద శతకం సాధించిన కమిందు మెండీస్

టెస్టు క్రికెట్‌లో శ్రీలంక యువ క్రికెటర్ కమిందు మెండిస్ (25) అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. అరంగేట్రం చేసిన నాటి నుంచి బ్యాటింగ్‌లో అతడు అప్రతిహతంగా దూసుకెళుతున్నాడు. గాలే వేదికగా న్యూజిలాండ్‌తో గురువారం మొదలైన రెండవ టెస్టులోనూ అతడు నిలకడైన ప్రదర్శన చేశాడు. 

తొలి రోజు ఆట ముగిసే సమయానికి కమిందు మెండిస్ 51 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో నిలిచాడు. దీంతో అతడు చారిత్రాత్మకమైన రికార్డును సృష్టించాడు. అరంగేట్రం తర్వాత వరుసగా ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌ల్లో 50 కంటే ఎక్కువ పరుగులు సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా కమిందు అవతరించాడు. ఒక వర్ధమాన ఆటగాడు వరుసగా ఎనిమిది టెస్టుల్లో 50 ప్లస్ స్కోర్లు సాధించడం 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.

కమిందు మెండిస్‌కు ముందు పాకిస్థాన్ ఆటగాడు షాద్ షకీల్ వరుసగా ఏడు టెస్టు మ్యాచ్‌ల్లో 50 ప్లస్ స్కోర్లు సాధించాడు. అతడికంటే ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ వరుసగా 6 మ్యాచ్‌ల్లో 50కి పైగా స్కోర్లు సాధించారు. అయితే గవాస్కర్‌తో మరో ముగ్గురు బ్యాటర్లు కూడా వరుసగా 6 టెస్ట్ మ్యాచ్‌ల్లో 50కిపైగా స్కోర్లు సాధించారు.

అరంగేట్రం నుంచి వరుస టెస్టుల్లో 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాళ్లు..
1. కమిందు మెండిస్ - 8 
2. సౌద్ షకీల్ - 7 
3. సునీల్ గవాస్కర్, బెర్ట్ సట్‌క్లిఫ్, సయీద్ అహ్మద్, బాసిల్ బుచర్ - 6

కాగా గాలె వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక 3 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. దినేశ్ చండిమాల్ సెంచరీతో రాణించాడు. ఏంజెలో మాథ్యూస్ 78, కమిందు మెండిస్ 51 పరుగులతో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.

  • Loading...

More Telugu News