Virat Kohli: బుమ్రా వేసిన 15 బంతుల్లో 4 సార్లు ఔటైన కోహ్లీ.. అసహనానికి గురైన స్టార్ బ్యాటర్!
- బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో దారుణంగా విఫలమైన విరాట్
- నెట్ ప్రాక్టీస్‌లోనూ అదే పరిస్థితి
- పేసర్ బుమ్రా బౌలింగ్‌లో ఇబ్బందిపడ్డ కోహ్లీ
- స్పిన్ త్రయం అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ బౌలింగ్‌లోనూ ఇదే పరిస్థితి
బంగ్లాదేశ్‌తో చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్‌లో 17 పరుగులు మాత్రమే సాధించాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పేసర్ హసన్ మహ్మద్ బౌలింగ్‌లో, రెండవ ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో కాన్పూర్ వేదికగా జరగనున్న రెండవ టెస్టులో కోహ్లీ రాణిస్తాడా లేదా అనే విశ్లేషణలు ఊపందుకున్నాయి.
ప్రాక్టీస్ సెషన్‌లో ఘోరంగా విఫలం...
కాన్పూర్ టెస్టుకు ముందు ప్రాక్టీస్ సెషన్లలో కోహ్లీ దారుణంగా విఫలమైనట్టు, భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు తెగ ఇబ్బందిపడినట్టు కథనాలు వెలువడుతున్నాయి. నెట్స్‌లో కోహ్లీ దారుణంగా ఫెయిల్ అయినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.
ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన 15 బంతుల్లో కోహ్లీ ఏకంగా నాలుగు సార్లు ఔటైనట్టు తెలిపింది. బుమ్రా వేసిన నాలుగవ బంతి కోహ్లీ ప్యాడ్‌లపైకి దూసుకెళ్లింది. ‘నువ్వు వికెట్ లైన్ మీదే ఉన్నావ్’ అంటూ ఈ సందర్భంలో బుమ్రా అప్పీల్ చేశాడు.
మరో రెండు బంతుల తర్వాత ఆఫ్-స్టంప్ వెలుపలకు వెళుతున్న బంతిని కోహ్లీ వెంబడించి ఆడగా అది బ్యాట్ ఎడ్జ్‌ను తాకి స్లిప్‌లోకి వెళ్లింది. ఆ తర్వాత రెండు వరుస బంతులను బుమ్రా మార్చివేయగా వాటిని ఆడేందుకు కూడా కోహ్లీ ఇబ్బంది ఎదుర్కొన్నాడు. కోహ్లీని కొట్టిన ఒక బంతి షార్ట్ లెగ్ దిశలో క్యాచ్ పట్టుకునే అవకాశాలున్నాయి.
స్పిన్నర్ల బౌలింగ్‌లోనూ సేమ్ సీన్...
బుమ్రా బౌలింగ్ ఆడిన తర్వాత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ప్రాక్టీస్ చేస్తున్న నెట్స్ వైపు కోహ్లీ వెళ్లాడు. వారి బౌలింగ్‌లో ఆడేందుకు కూడా కోహ్లీ ఆపసోపాలు పడ్డాడు.
జడేజా బౌలింగ్‌లో ఇన్‌సైడ్-అవుట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఏకంగా మూడు సార్లు బంతిని మిస్ అయ్యాడు. ఇక అక్షర్ పటేల్ బౌలింగ్‌లోనైతే కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడని, ఈ పరిణామంతో అతడు తీవ్ర అసహనానికి గురైనట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది. కోహ్లీ ఆందోళనగా కనిపించాడని వెల్లడించింది.