Lebanon: లెబనాన్ లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ బలగాలు!
- గ్రౌండ్ అటాక్ కు సిద్ధమవుతున్న ఐడీఎఫ్
- హిజ్బుల్లాను అంతం చేయడమే లక్ష్యం
- ఉగ్రవాదులను ఏరివేయనున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటన
లెబనాన్ నుంచి తమ భూభాగంపై దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. రెండు రోజుల పాటు వైమానిక దాడులు చేసి హిజ్బుల్లా కీలక నేతలు సహా వందలాది మందిని మట్టుబెట్టింది. అయినప్పటికీ హిజ్బుల్లా దాడులు ఆగకపోవడంతో గ్రౌండ్ దాడులకు సిద్ధంగా ఉండాలంటూ తన బలగాలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశాలు జారీ చేశారు. దీంతో లెబనాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి హిజ్బుల్లా ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) సిద్ధమవుతోంది. ఏ క్షణంలోనైనా ఐడీఎఫ్ బలగాలు లెబనాన్ లో అడుగుపెట్టే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ఓ ప్రకటన విడుదల చేసింది. హిజ్బుల్లాను అంతం చేయడమే లక్ష్యమని స్పష్టం చేసింది.
గడిచిన మూడు రోజుల్లో లెబనాన్ లోని 2 వేలకు పైగా హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసింది. లెబనాన్ లో హిజ్బుల్లా ఉగ్రవాదులను మట్టుబెడతామని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన హిజ్బుల్లా కూడా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది. టెల్ అవీవ్ లోని ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ ప్రధాన కార్యాలయంపైకి బుధవారం బాలిస్టిక్ మిసైల్ ను ప్రయోగించినట్లు హిజ్బుల్లా వెల్లడించింది. మరోవైపు, ఇజ్రాయెల్- హిజ్బుల్లా యుద్ధంపై అమెరికా రక్షణశాఖ స్పందించింది. లెబనాన్ పై గ్రౌండ్ అటాక్ చేయాలన్న నిర్ణయం అంత మంచిది కాదని పేర్కొంది.
అయితే, మధ్య ప్రాచ్యంలో ఆల్ ఔట్ వార్ జరిగే అవకాశం లేకపోలేదంటూ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడంలో వెనుకడుగు వేయబోమని స్పష్టం చేశారు. లెబనాన్ లో దాడులను వెంటనే ఆపాలంటూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఇజ్రాయెల్ కు పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ స్పందిస్తూ.. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందంటూ ఇజ్రాయెల్ పై మండిపడింది.