KTR: గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది... చిట్టినాయుడు ఉంటేనే కేసీఆర్ విలువ తెలుస్తుంది: కేటీఆర్

KTR satires on Revanth Reddy

  • ఆడబిడ్డలతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి లగ్గం చేస్తారని విమర్శ
  • వినయ్ భాస్కర్ ఓడిపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్న కేటీఆర్
  • సీఎంగా అవుతానని రేవంత్ రెడ్డి కూడా అనుకోలేదన్న కేటీఆర్

గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది... చిట్టినాయుడు ఉంటేనే కదా కేసీఆర్ విలువ తెలిసేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆడబిడ్డలతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి వారు పక్కా లగ్గం చేస్తారని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో వరంగల్ వెస్ట్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఓటమి కూడా మనకు మంచిదే అన్నారు. కాంగ్రెస్ పాలన చూస్తేనే కేసీఆర్ విలువ తెలుస్తుందన్నారు.

ప్రస్తుతం బీఆర్ఎస్ సంధికాలంలో ఉందన్నారు. ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్‌కు కొత్తేనని పేర్కొన్నారు. డీఎంకే పార్టీ 76 ఏళ్లుగా తమిళనాడులో రాజకీయాలు శాసిస్తోందన్నారు. మనది కేవలం 24 ఏళ్ల పార్టీ మాత్రమే అన్నారు. ఇంకా వందేళ్లు ఉండాలంటే మనం మరింత ధృడంగా తయారు కావాలన్నారు. వచ్చే మన ప్రభుత్వంలో వరంగల్ నుంచి వినయ్ భాస్కర్ గెలిచి, మంత్రి అవుతారని జోస్యం చెప్పారు.

ప్రజలకు అందుబాటులో ఉండే వినయ్ భాస్కర్ ఓడిపోవటం తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. మనం చేసింది చెప్పుకోలేదు... కానీ వాళ్లు చేయని దానికి క్రెడిట్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. దేశంలో అత్యధికంగా జీతాలు ఇచ్చినప్పటికీ ఉద్యోగులు మనకు దూరమయ్యారని వాపోయారు.

రేవంత్ రెడ్డి కూడా అనుకోలేదు

ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి కూడా అనుకోలేదన్నారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితులు తనకు చెప్పారని వెల్లడించారు. అధికారంలో లేమని కొంతమంది పార్టీ నుంచి వెళ్లిపోతున్నారని... అలా వెళ్లేవారు వెళ్లిపోవచ్చునన్నారు. 

అధికారంలో ఉన్నప్పుడు పదవులు తీసుకున్న పెద్ద పెద్ద నాయకులు కూడా వదిలి వెళ్లిపోయారని మండిపడ్డారు. అరికెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అయితే ఆయనకు కండువా కప్పిన దౌర్భాగ్యుడు ఎవరని ప్రశ్నించారు. స్టేషన్ ఘనపూర్‌కు తప్పకుండా ఉప ఎన్నిక వస్తుందని, మనం గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

చిట్టినాయుడు, ఆయన సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. బావమరిది కంపెనీకి రూ.1,137 కోట్ల పనులు ఎలా ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి బీజేపీ రక్షణ కవచంలా ఉందని ఆరోపించారు. గుజరాత్ మోడల్ ఫేక్ అని రాహుల్ గాంధీ అంటే, బెస్ట్ అని రేవంత్ రెడ్డి అంటున్నారని విమర్శించారు. 

  • Loading...

More Telugu News