Payyavula Keshav: మాజీ సీఎం జగన్‌పై మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర విమర్శలు

Payyavula Keshav said that What do we need to say that a misdeed has happened over Tirumala Laddu Row

  • తిరుమల వ్యవహరం జగన్‌కు ఒక రాజకీయ ఈవెంట్‌ అని మండిపాటు
  • జరగని అపచారాన్ని జరిగిందని చెప్పడానికి తమకేం అవసరమని ప్రశ్నించిన మంత్రి
  • పాలకుడు మారాడు కాబట్టే వాస్తవాలు బయటపడుతున్నాయని వ్యాఖ్య

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ఏపీలో రాజకీయ మంటలు రాజేస్తోంది. నెయ్యి కల్తీ జరగకపోయినా జరిగినట్టు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి నేతల పాపాలను క్షమించి వదిలేయమని వేంకటేశ్వర స్వామిని కోరుతూ సెప్టెంబర్‌ 28న రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేయనున్నట్టు వైసీపీ ప్రకటించింది. ఈ ప్రకటనపై ఏపీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు.

వైసీపీ ఎమ్మెల్యే జగన్ ఈ నెల 28వ తేదీన పూజలు చేయాలని పిలుపిచ్చారని... ఆయన మారలేదని, ఆయన దురాలోచనలు మానుకోలేదని మంత్రి విమర్శించారు. తిరుమల వ్యవహరం జగన్‌కు ఒక రాజకీయ ఈవెంట్‌ అని, కానీ తమకు ఇది ఓ సెంటిమెంట్ అని ఆయన వ్యాఖ్యానించారు. జరగని అపచారాన్ని జరిగిందని చెప్పడానికి తమకేం అవసరమని మంత్రి ప్రశ్నించారు. జరిగింది కాబట్టే చెబుతున్నామని స్పష్టం చేశారు. జగన్‌‌కు దేవుడి మీద నమ్మకం లేకపోవడంతోనే ఈ తప్పులు జరిగాయని అన్నారు. 

వేంకటేశ్వర స్వామి వారి మీద జగన్‌కు నిజంగా నమ్మకం ఉంటే తిరుమలలో డిక్లరేషన్ మీద సంతకం చేయాలని సవాలు విసిరారు. జగన్ చేసిన తప్పులకు భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నది చాలు అని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.

‘‘జగన్ చేసిన పాపాలు ఇక చాలు. కల్తీ నెయ్యి నిజం... ఆ కల్తీ  నెయ్యి లడ్డూల్లో వినియోగించింది నిజం. అపచారం జరిగింది నిజం. జగన్ అబద్దం... జగన్ చేసే పూజలు అబద్దం’’ అని ఆయన విమర్శించారు. పాలకుడు మారాడు కాబట్టే తిరుమలలో నిజాలు బయటకు వస్తున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. 

గతంలో ఉన్న లడ్డూ నాణ్యతకు, ప్రస్తుతం ఉన్న లడ్డూ నాణ్యతకు తేడా ఏంటని భక్తులని అడగాలని, అప్పుడు వాస్తవాలు తేలుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మహాద్వారం నుంచి సీఎం వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు మాత్రం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే దర్శనం చేసుకుంటున్నారని ప్రస్తావించారు. 

వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలోని ఓ మెంబర్ నెయ్యి వ్యవహారంపై అనుమానాన్ని వ్యక్తం చేశారని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తక్కువ ధరకు స్వచ్ఛమైన నెయ్యి ఎలా వస్తుందని ఉత్తర భారతదేశానికి చెందిన ఓ సభ్యుడు లేవనెత్తారని, కానీ నాటి ఈవో ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అణగదొక్కారని మంత్రి ఆరోపించారు. 

వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో దోపిడీ చేస్తే శిక్ష తప్పదని, శిక్ష పడిన ఘటనలు చాలానే ఉన్నాయని ఆయన ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News