Trash Balloons: ఉత్తర కొరియా బెలూన్ల కారణంగా నిలిచిన దక్షిణ కొరియా విమానాలు.. వీడియో ఇదిగో!
- గంటల తరబడి మూతపడ్డ విమానాశ్రయాలు
- విమానాల ల్యాండింగ్ కు అంతరాయం
- గాలిలో చక్కర్లు కొట్టిన విమానాలు
ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమని మండే పరిస్థితి కొనసాగుతోంది. కొన్నిరోజులుగా రెండు దేశాల మధ్య బెలూన్ వార్ జరుగుతోంది. ఇటీవల కిమ్ కు వ్యతిరేకంగా రూపొందించిన కరపత్రాలు, పాశ్చాత్య సంగీతం నింపిన క్యాసెట్లు, డాలర్ నోట్లు తదితర వస్తువులను దక్షిణ కొరియా ఉద్యమకారులు బెలూన్లకు కట్టి ఉత్తర కొరియాలోకి వదిలారు. దీనికి కౌంటర్ గా ఉత్తర కొరియా కూడా బెలూన్లను దక్షిణ కొరియాలోకి వదిలింది. అయితే, ఈ బెలూన్లకు చెత్త మూటలు కట్టి పంపుతోంది. జంతువులు, మనుషుల విసర్జితాలు సహా ఇతరత్రా చెత్తను మూటలుగా కట్టిపంపుతోంది. ఈ బెలూన్ల కారణంగా దక్షిణ కొరియాలోని పలు విమానాశ్రయాలు తరచూ మూతపడుతున్నాయి. రన్ వేలపై బెలూన్లు పడడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే ఎయిర్ పోర్టులలో ఇచియాన్ విమానాశ్రయం కూడా ఒకటి.. అలాంటి ఎయిర్ పోర్టును ఉత్తర కొరియా బెలూన్ల కారణంగా జూన్ 1 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఆరు గంటలు మూసేయాల్సి వచ్చిందని దక్షిణ కొరియా డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు యంగ్ బూ నామ్ పేర్కొన్నారు. తాజాగా సోమవారం కూడా ఈ ఎయిర్ పోర్టును దాదాపు గంటన్నర పాటు అధికారులు మూసివేశారని వివరించారు. ఉత్తర కొరియా చెత్త బెలూన్ల కారణంగా ల్యాండింగ్ ఆలస్యం, మార్గం మళ్లింపు భయాలతో విమానాలు అత్యధిక ఇంధనాన్ని తీసుకెళ్లాల్సి వస్తోందన్నారు. మే నెల చివరి వారం నుంచి ఇప్పటి వరకు ఉత్తర కొరియా దాదాపు 5,500 చెత్త బెలూన్లను తమ దేశంలోకి పంపిందని చెప్పారు. ఒక బెలూన్ ఏకంగా తమ ప్రెసిడెంట్ నివాస ప్రాంగణంలో పడిందని, మరొకటి ఎయిర్ పోర్ట్ రన్ వే పై పడిందని తెలిపారు.