KTR: ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఉందంటూ కేటీఆర్ వ్యాఖ్యలు... మేలుకో బాలుడా అంటూ బండి సంజయ్ కౌంటర్
- అమృత్ పథకంపై కేటీఆర్, బండి సంజయ్ మధ్య వాగ్యుద్ధం
- అమృత్ పథకంపై పాలు తాగిన దొంగ పిల్లిలా కళ్లు మూసుకున్నారని విమర్శ
- కాంగ్రెస్ చుట్టూ మీరు డ్యాన్స్ చేస్తుంటే... ముందే అవినీతిపై మాట్లాడామన్న సంజయ్
కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య ఎక్స్ వేదిక ట్వీట్ యుద్ధం సాగింది. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా మీ తీరు ఉందని కేటీఆర్ విమర్శించగా, అస్తిత్వం కోసం కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు.
"బండి సంజయ్ గారికి" అంటూ మొదట కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ వ్యవహారం దొంగలుపడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్టు ఉందని విమర్శించారు. మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అన్న విషయం మర్చి పోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. అమృత్ మీ కేంద్ర పథకమేనని, అందులో అవినీతి జరిగిందని ముందుగా చెప్పింది స్వయానా మీ పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డేనని పేర్కొన్నారు. అయినప్పటికీ పాలు తాగుతున్న దొంగ పిల్లిలా కళ్లు మూసుకున్నారని ఆరోపించారు.
ఈ వ్యవహారం మొత్తం ఆధారాలతో తాము బయటపెట్టాక ఈ చిల్లర మాటలు దేనికి? సీవీసీ స్వతంత్ర సంస్థ... దానికి మీ సిఫార్సు దేనికి? అని ప్రశ్నించారు. అయినా మీ అజబ్ ప్రేమ్‌కి గజబ్ కహానీ అందరూ గమనిస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు.
బండి సంజయ్ కౌంటర్
కేటీఆర్ ట్వీట్ లేఖకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. "మేలుకో బాలుడా... ప్రజలు మీ 'గోల్‌మాల్'ను కొనుగోలు చేయడం లేదు" అని చురక అంటించారు. మీ పెర్ఫార్మెన్స్‌కు కాంగ్రెస్ పార్టీ అదే పనిగా మీకు అభినందనలు తెలియజేస్తోంది అని తెలిపారు. కానీ ఇది మరో 'డ్రామారావు' వ్యవహారం అని ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. ప్రియమైన గజినీ... కాంగ్రెస్ చుట్టూ మీరు డ్యాన్స్ చేయడంలో బిజీగా ఉన్నారు, కానీ బీజేపీ అంతకు ముందు నుంచే అమృత్ టెండర్ల అవినీతిపై మాట్లాడుతోంది అని వెల్లడించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన స్వంత 'కల్ హో నా హో' దృష్టాంతంలో కూరుకుపోయిందన్నారు. ఎలాంటి అక్రమాలు జరగలేదని వారు నమ్మితే వెంటనే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ విచారణను కోరాలని డిమాండ్ చేశారు. విచారణ కూడా వేగవంతమయ్యేలా చూస్తామన్నారు. మీ 'అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ'లో బీజేపీకి అతిథి పాత్ర అవసరం లేదని, తాము ప్రజల కోసమే ఉన్నామని బండి సంజయ్ పేర్కొన్నారు.