Badlapur: బద్లాపూర్ రేపిస్ట్ ఎన్‌కౌంటర్.. తప్పించుకునే ప్రయత్నంలో పోలీసుల చేతిలో హతం

Badlapur rapist killed in police encounter

  • దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బద్లాపూర్ లైంగికదాడి ఘటన
  • ఆయన రెండోభార్య పెట్టిన కేసులో ప్రశ్నించేందుకు తీసుకెళ్తుండగా పోలీసుల నుంచి తుపాకి లాక్కుని కాల్పులు
  • ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో హతం
  • పోలీసు కాల్పుల్లో నిందితుడు మృతి చెందినట్టు నిర్ధారించిన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే

బద్లాపూర్ అత్యాచార నిందితుడు అక్షయ్ షిండే (24) పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో నర్సరీ చదువుకుంటున్న నాలుగేళ్లున్న ఇద్దరు చిన్నారులపై అదే స్కూల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్నఅక్షయ్ షిండే అత్యాచారానికి పాల్పడ్డినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన అక్షయ్‌ను అతడి నుంచి విడిపోయిన రెండో భార్య పెట్టిన కేసులో విచారించేందుకు జైలు నుంచి తీసుకెళ్తుండగా పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో వారి తూటాలకు బలయ్యాడు.

పోలీసుల కథనం ప్రకారం.. తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ షిండేపై గతవారం ఆయన రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధింపులకు గురిచేసినట్టు ఆరోపించింది. ఈ కేసులో అతడిని ప్రశ్నించేందుకు నిన్న సాయంత్రం 5.30 గంటల సమయంలో తలోజా జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పదిమంది పోలీసుల భద్రతతో బద్లాపూర్‌కు తీసుకెళ్తుండగా ముంబ్రా బైపాస్ వద్ద వ్యానులో ఉన్న పోలీసు నుంచి తుపాకి లాక్కుని కాల్పులు ప్రారంభించాడు. 

ఓ ఏఎస్సై కాలులోకి బులెట్లు దూసుకెళ్లాయి. దీంతో అప్రమత్తమైన మరో పోలీసు నిందితుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నిందితుడితోపాటు పోలీసులు కూడా గాయపడ్డారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అక్షయ్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసు కాల్పుల్లో నిందితుడు మృతి చెందినట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నిర్ధారించారు.

More Telugu News