Monkeypox Virus: భారత్‌లో తొలి క్లాడ్ 1బీ’ మంకీపాక్స్ కేసు నిర్ధారణ... హెల్త్ ఎమర్జెన్సీకి దారితీసిన రకం వైరస్ ఇదే!

A Kerala man confirmed monkeypox virus MPOX clade 1 strain

  • కేరళలో 38 ఏళ్ల వ్యక్తికి నిర్ధారణ
  • ప్రస్తుతం నిలకడగా ఉన్న రోగి ఆరోగ్యం
  • ఇటీవలే యూఏఈ వెళ్లి వచ్చిన బాధితుడు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి కారణమైన ‘మంకీపాక్స్ క్లాడ్ 1బీ’ రకం వైరస్ తొలి కేసు భారత్‌లోనూ వెలుగుచూసింది. కేరళకు చెందిన 38 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ నిర్ధారణ అయింది.

కేరళకు చెందిన బాధిత వ్యక్తిలో క్లాడ్ 1బీ రకం వైరస్ నిర్ధారణ అయింది. ఈ మేరకు గతవారమే పరీక్షల్లో తేలినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. కాగా బాధిత వ్యక్తి ఇటీవలే యూఏఈ పర్యటనకు వెళ్లి వచ్చాడని కేరళ వైద్య మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. 

రోగి రాష్ట్రంలోని మలప్పురానికి చెందినవాడు. అనారోగ్యానికి గురైన అతడు మొదట ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడి నుంచి అతడిని మంజేరి మెడికల్ కాలేజీకి తరలించారు. ఆ తర్వాత మంకీపాక్స్ కావొచ్చనే అనుమానం రావడంతో అతడి నమూనాలను సేకరించి పరీక్ష కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీకి పంపారు. అక్కడ అతడికి మంకీపాక్స్ నిర్ధారణ అయింది.

కేరళలో కేసు నమోదు కావడానికి ముందు హర్యానాలో కూడా ఒక మంకీపాక్స్ కేసు నమోదయింది. 26 ఏళ్ల యువకుడికి నిర్ధారణ అయింది. అతడికి క్లాడ్ 2 రకం ఎంపాక్స్‌ సోకింది. ఇది అంత ప్రమాదకరమైనది కాకపోవడంతో అతడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యాడు.

కాగా మంకీపాక్స్ వైరస్‌లో క్లాడ్ 1 (సబ్‌క్లాడ్‌లు 1ఏ, 1బీ), క్లాడ్ 2 (సబ్‌క్లాడ్‌లు 2ఏ, 2బీ) అనే రెండురకాలు ఉన్నాయి. కాంగో, ఇతర దేశాలలో 1ఏ, 1బీ క్లాడ్‌ల కారణంగా కేసుల్లో పెరుగుదల నమోదయింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగస్టు నెలలో మంకీపాక్స్ వ్యాప్తిపై ఆందోళన చేసింది. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించింది.

  • Loading...

More Telugu News