Congress: హెచ్‌సీఏలో కాంట్రాక్ట్ వ్యవహారాలపై విచారణ జరిపించండి: డీజీకి కాంగ్రెస్ ఎంపీ లేఖ
- టెండర్ ప్రక్రియ, రవాణా సేవలు, ఇతర కాంట్రాక్ట్ వ్యవహారాలపై దర్యాఫ్తు చేయాలని లేఖ
- యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందన్న ఎంపీ
- నిర్ణయాధికారాలు కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉన్నాయన్న ఎంపీ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో కాంట్రాక్ట్ వ్యవహారాలపై విచారణ జరిపించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు విజిలెన్స్ అదనపు డీజీకి ఆయన లేఖ రాశారు. హెచ్‌సీఏలో టెండర్ ప్రక్రియ, రవాణా సేవలు సహా ఇతర కాంట్రాక్టు వ్యవహారాలపై దర్యాఫ్తు జరపాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
క్యాటరింగ్, రవాణా సేవల కోసం టెండర్ ప్రక్రియపై యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. ఇది అసోసియేషన్ పనితీరును ప్రభావితం చేస్తుందన్నారు. అపెక్స్ కౌన్సిల్‌తో సరైన సంప్రదింపులు లేకుండా ముందుకు వెళుతున్నారని, నిర్ణయాధికారాలు కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. టెండర్ లేకుండానే ఐపీఎల్ కాంట్రాక్టులు ఇవ్వడం వంటి నిర్ణయాలు హెచ్‌సీఏ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆదాయానికి, వ్యయానికి సంబంధించి పారదర్శకత లేకపోవడం బాధాకరమన్నారు. మ్యాచ్‌ల సమయంలో రద్దీని క్రమబద్ధీకరించేందుకు, భద్రతను మెరుగుపరచడానికి ఉప్పల్ స్టేడియంలో మల్టీలెవల్ పార్కింగ్ అవసరమని పేర్కొన్నారు. ఈ విషయాలపై విచారణను ప్రారంభించి, హెచ్‌సీఏ సమగ్రతను పునరుద్ధరించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.