Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీపై బాంబే ఆర్చ్‌బిషప్ కార్డినల్ గ్రేసియస్ ప్రశంసలు
- ప్రతి ఒక్కరి పట్ల మోదీ శ్రద్ధ వహిస్తున్నారన్న ఆర్చ్‌బిషప్
- మైనార్టీలలో కూడా ఆయన పట్ల విశ్వాసం పెరుగుతోందని వ్యాఖ్య
- భారతదేశ వైవిధ్యాన్ని కొనియాడిన ఆర్చ్‌బిషప్
ప్రధాని నరేంద్ర మోదీ తన పాలనలో అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నారని బాంబే ఆర్చ్‌బిషప్ కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేసియస్ ప్రశంసించారు. ప్రతి ఒక్కరి పట్ల మోదీకి ఉన్న శ్రద్ధ... మైనార్టీలలో కూడా ఆయన పట్ల విశ్వాసాన్ని పెంపొందిస్తోందని వ్యాఖ్యానించారు.
ముంబైలో 'ఏక్ పేద్ మా కే నామ్' కార్యక్రమంలో పాల్గొన్న ఆర్చ్‌బిషప్ గ్రేసియస్, ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ... మైనార్టీలతో పాటు ప్రతి ఒక్కరి గురించి ప్రధాని ఆలోచిస్తున్నారన్నారు. ఏ పని చేసినా క్రైస్తవులు సహా ప్రతి మైనార్టీ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేస్తారని భావిస్తున్నామన్నారు. భారతదేశ వైవిధ్యాన్ని ఆయన కొనియాడారు.
భిన్న ప్రజలు, సంస్కృతులు, భాషలు, మతాలను కలిగి ఉన్న మన దేశం చాలా గొప్పదన్నారు. భారత్‌లో ఉన్న గొప్పతనం ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదన్నారు.
ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని 'సేవా పఖ్వాడ్' నిర్వహించడంపై కూడా గ్రేసియస్ స్పందించారు. సేవా పఖ్వాడ్ 2024ని నిర్వహించడం ద్వారా ఇది చాలా ముఖ్యమైన రోజుగా పేర్కొన్నారు. అందరినీ ప్రోత్సహించే ఉద్దేశంతో దీనిని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం, భూమిని, ప్రకృతిని సంరక్షించి భవిష్యత్తు తరాలకు అందించాలనేది తమ ఉద్దేశమన్నారు. చెట్ల పెంపకం ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మహారాష్ట్రలోని క్రైస్తవ సంఘం సేవా పఖ్వాడాను నిర్వహించింది. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పఖ్వాడాను పదిహేను రోజుల పాటు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తారు. రక్తదానం, హెల్త్ క్యాంపులు సహా వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు.