snake bite: పాము కరిచి వ్యక్తి మృతి.. అతడి చితిపైనే పాముని దహనం చేసిన గ్రామస్థులు.. ఎందుకంటే?
- ఇంకెవరికైనా హాని తలపెడుతుందేమోనన్న భయంతో సర్ప దహనం
- కట్ల పాము కరిచి 22 ఏళ్ల యువకుడు మృతి
- ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో వెలుగుచూసిన ఘటన
ఓ విష సర్పం కరిచి 22 ఏళ్ల యువకుడు చనిపోయాడు. అయితే ఆ ఊరి జనాలు కరిచిన పాముని పట్టుకొని అది బతికి ఉండగానే అతడి చితిపై వేసి దహనం చేశారు. ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో వెలుగుచూసింది. ఆ పాము బతికి ఉంటే ఇంకెవరికైనా హాని తలపెట్టే అవకాశం ఉంటుందని, అందుకే ఇలా చేశామని గ్రామస్థులు చెప్పారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. కొందరు వ్యక్తులు తాడుతో పాముని ఈడ్చుకెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా ఈ ఘటనపై జిల్లా స్థాయి అధికారి ఒకరు స్పందించారు. సరీసృపాలు, పాముకాట్లపై జనాలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బైగామర్ గ్రామానికి చెందిన దిగేశ్వర్ రాథియా అనే యువకుడు శనివారం రాత్రి తన ఇంట్లోని ఒక గదిలో మంచంపై పడుకుని ఉన్న సమయంలో అతడిని సాధారణ కట్లపాము కరిచిందని వెల్లడించారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు తక్షణమే హాస్పిటల్‌కు తరలించారని, కోర్బాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం అతడు ప్రాణాలు విడిచాడని అధికారి వెల్లడించారు.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించారని తెలిపారు. అయితే యువకుడి చావుకు కారణమైన పామును అప్పటికే పట్టుకుని బుట్టలో పెట్టి మూత వేశారని, అనంతరం తాడుతో పామును కట్టేసి ఓ కర్రకు వేలాడదీశారని సదరు అధికారి వివరించారు. రథియా మృతదేహాన్ని ఇంటి నుంచి ఊరేగింపుగా శ్మశానవాటికకు తీసుకెళ్లారని, గ్రామస్థులు పామును కూడా అక్కడికి ఈడ్చుకెళ్లారని, ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో కనిపించిందని అధికారి వివరించారు.
రాథియా అంత్యక్రియల సమయంలో చితిపై వేసి సజీవంగా ఉన్న పామును దహనం చేశారని, వేరొకరిపై దాడి చేస్తుందేమోనన్న భయాందోళనతో చితిపై వేసి కాల్చిచంపారని కోర్బా సబ్ డివిజనల్ అధికారి ఆశిష్ ఖేల్వార్ చెప్పారు. పామును చంపిన గ్రామస్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన వివరించారు. పర్యావరణ వ్యవస్థకు సరీసృపాలు ముఖ్యమైనవి కాబట్టి పాముకాటుపై ప్రజలకు అవగాహన కల్పించడం అవసరమని ఆయన చెప్పారు.