Harish Rao: పోలీసుల అత్యుత్సాహం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగిందో చూశాం: హరీశ్ రావు

Harish Rao warns Telangana police

  • తెలంగాణలో అత్యాచారాలు, గూండాయిజం పెరిగాయని ఆరోపణ
  • శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం విఫలమైందన్న హరీశ్ రావు
  • సునీతా లక్ష్మారెడ్డి నివాసంపై దాడులు చేశారని ఆగ్రహం
  • రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో సమస్యలను డైవర్ట్ చేస్తున్నారన్న మాజీ మంత్రి

అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు... పోలీసుల అత్యుత్సాహం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందో మనం చూశామని, పోలీసు అధికారులు చట్టాలకు లోబడి పని చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో గూండాయిజం, అత్యాచారాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలోనే 2 వేలకు పైగా అత్యాచారాలు జరిగాయని విమర్శించారు. శాంతిభద్రతల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

హైదరాబాద్, దేవరకద్రలో నిన్న ఒక రోజే రెండు అత్యాచారాలు జరిగాయన్నారు. కానీ పోలీసులు ప‌ట్టించుకోవ‌డం లేదని ఆరోపించారు. ఇలాంటి కేసుల్లో నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై నిన్న రాత్రి కాంగ్రెస్ గూండాలు దాడులు చేశారని ఆరోపించారు. ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రాత్రి సమయంలో ఇంటి ముందు పటాకులు పేల్చి, తలుపులు తీయించి మరీ దాడులు చేయడమేమిటని మండిపడ్డారు. ఈ దాడికి సంబంధించి విజువల్స్ కూడా ఉన్నాయన్నారు. ఈ ఘటనపై వెంటనే డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందిందని, వీటి నుంచి డైవర్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైడ్రామాకు తెరలేపారని విమర్శించారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటపొలాలు ఎండిపోతున్నాయని, మరోవైపు లక్షలాది మంది డెంగ్యూ, చికెన్ గున్యాతో బాధపడుతున్నారని, వీటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News