Anura Dissanayake: శ్రీలంక తొమ్మిదో అధ్యక్షుడిగా దిస్సనాయకే ప్రమాణం.. తొలి లెఫ్ట్ పార్టీ నేతగా రికార్డు

Anura Dissanayake takes oath as Sri Lanka 9th President

  • మూడు రోజుల క్రితం శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు
  • రెండో ప్రాధాన్య ఓట్లలో తేలిన దిస్సనాయకే విజయం
  • శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని మోదీ

శ్రీలంక తొమ్మిదో అధ్యక్షుడిగా జనతా విముక్తి పెరమున (జేవీపీ) పార్టీ నేత, వామపక్ష నాయకుడు అనుర దిస్సనాయకే (55) ప్రమాణస్వీకారం చేశారు. దేశానికి అధ్యక్షుడైన తొలి లెఫ్ట్ పార్టీ నేతగా ఆయన రికార్డులకెక్కారు. కొలంబోలోని అధ్యక్ష సెక్రటేరియట్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ జయంత జయసూర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 

దేశంలో మొన్న అధ్యక్ష ఎన్నికలు జరగ్గా అదే రోజు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తర్వాత దిస్సనాయకే, సమగి జన సంధానయ అభ్యర్థి సజిత్ ప్రేమదాస ఇద్దరూ గెలుపునకు అవసరమైన ఓట్లను పొందడంలో విఫలమయ్యారు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించడంతో దిస్సనాయకే విజయం ఖరారైంది. 

నిన్న సాయంత్రం ఏడు గంటలకు తుది ఫలితం ప్రకటించిన తర్వాత దిస్సనాయకే మాట్లాడుతూ.. శతాబ్దాలుగా మనం పెంచుకున్న కల ఎట్టకేలకు సాకారం కాబోతోందని పేర్కొన్నారు. ఈ ఘతన ఏ ఒక్కరి వల్లో సాధ్యం కాలేదని, వేలాదిమంది సమష్టి కృషి వల్లే సాధ్యమైందని తెలిపారు. మీ నిబద్ధతే ఇంతదూరం తీసుకొచ్చిందని, ఈ విజయం అందరిదీ అని పేర్కొన్నారు. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దిస్సనాయకేకు భారత ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. దిస్సనాయకే విజయం తర్వాత భారత హైకమిషనర్ వెంటనే ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News