Donald Trump: ఓడిపోతే ఇక అంతే.. ఇంకోసారి పోటీ చేయను: ట్రంప్
- ప్రెసిడెంట్ పదవి రేసులో మూడోసారి ట్రంప్
- 2016లో హిల్లరీ క్లింటన్ ను ఓడించి అధ్యక్షుడిగా ఎన్నిక
- 2020లో బైడెన్ చేతిలో ఓటమి.. తాజాగా కమలా హారిస్ తో పోటీ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడడం తనకు ఇది మూడోసారి అని, ఇప్పుడు ఓడిపోతే మరోసారి పోటీ చేయబోనని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తొలిసారి 2016లో అధ్యక్ష బరిలోకి దిగిన ట్రంప్.. డెమోక్రాట్ల తరఫున పోటీ చేసిన హిల్లరీ క్లింటన్ ను ఓడించారు.
నాలుగేళ్ల పాటు అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మరోమారు ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ చేశారు. ఈసారి డెమోక్రాట్ల తరఫున జో బైడెన్ పోటీ చేశారు. అయితే, బైడెన్ చేతిలో ట్రంప్ ఓటమిపాలయ్యారు. ఫలితాల ప్రకటన తర్వాత తన ఓటమిని ఒప్పుకోని ట్రంప్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపించడం, ఆయన మద్దతుదారులు వైట్ హౌస్ ముందు ఆందోళన చేయడం తెలిసిందే. ఈ పరిణామాలపై ట్రంప్ ఇప్పటికీ పలు కేసులు ఎదుర్కొంటున్నారు.
తాజాగా 2024 అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ట్రంప్ కు ప్రత్యర్థిగా తొలుత జో బైడెన్ ఉన్నారు. అనారోగ్యం, ట్రంప్ తో జరిగిన డిబేట్ లో వెనకబడడం తదితర కారణాలతో బైడెన్ తప్పుకోగా.. ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అధ్యక్ష రేసులోకి అడుగుపెట్టారు. ట్రంప్, హారిస్ ఇద్దరూ సమ ఉజ్జీలేనని, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనిపై తాజాగా ట్రంప్ స్పందిస్తూ.. ఈసారి ఓడిపోతే ఇక అంతే. మరోసారి పోటీ చేయబోనని తేల్చిచెప్పారు. అయితే, గెలుపు తననే వరిస్తుందని పూర్తి నమ్మకం ఉందని ట్రంప్ చెప్పారు.