Jr NTR: ఇది చాలా బాధాకరం.. నాకు చాలా బాధగా ఉంది: 'దేవర' ఈవెంట్ రద్దుపై తారక్
- ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబోలో 'దేవర'
- ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల
- ఆదివారం నోవాటెల్ హోటల్‍లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‍కు మేకర్స్ ప్లాన్
- ఈ ఇండోర్ ఈవెంట్‍కు అభిమానులు భారీగా తరలిరావడంతో రద్దు చేసిన నిర్వాహకులు
- ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌ను ఉద్దేశించి వీడియో సందేశం పంపిన తారక్
'దేవర' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‍ను ఆదివారం సాయంత్రం హైదరాబాద్‍లోని నోవాటెల్ హోటల్‍లో నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. అయితే, ఈ ఇండోర్ ఈవెంట్‍కు అభిమానులు ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా వచ్చారు. అభిమానులు ఒక్కసారిగా నోవాటెల్ హోటల్‍లోకి దూసుకొచ్చారు. దాంతో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఈవెంట్‌ను రద్దు చేశారు.
ఇలా ఈవెంట్ అర్థాంతరంగా క్యాన్సిల్ కావడంతో హీరో ఎన్‌టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తారక్ అభిమానులను ఉద్దేశించి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. "ఇది చాలా బాధాకరం. నాకు చాలా బాధగా ఉంది. అవకాశం ఉన్నప్పుడు అభిమానులతో సమయం గడపాలని, దేవర మూవీ గురించి వివరించాలని అనుకున్నా.
కానీ భద్రతా కారణాలతో ఈవెంట్ రద్దైంది. నేనూ బాధపడుతున్నా. మీకంటే నా బాధ పెద్దది. ఇలా జరిగినందుకు ఎవరినీ నిందించవద్దు. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇవాళ మనం కలవకపోయినా ఈ నెల 27న కలవబోతున్నాం. మీరంతా సినిమా చూసి కాలర్ ఎగరేస్తారని నమ్మకంగా ఉన్నా. కొరటాల శివ ఈ మూవీని ఎంతో కష్టపడి తెరకెక్కించారు. అన్నింటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం దేవరకు, నాకు చాలా అవసరం. మీరంతా జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి" అని వీడియోలో ఎన్‌టీఆర్ పేర్కొన్నారు.
కాగా, హైవోల్టేజ్ యాక్షన్ మూవీ దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ నుంచి తొలి ట్రైలర్ అదిరిపోగా.. ఆదివారం విడుదలైన రిలీజ్ ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంది. యాక్షన్‍తో తారక్ విశ్వరూపం చూపారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో దేవర విడుదల అవుతోంది.ఈ శుక్రవారం (సెప్టెంబర్ 27న) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఈ చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటించింది. అలాగే ఈ మూవీతోనే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆయన విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమాకు తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ బాణీలు అందించారు.