Tara Master: నాగార్జున, రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన తారా మాస్టర్
- తారా మాస్టర్ ఆసక్తికర ఇంటర్వ్యూ
- అప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు గొప్ప హీరోలయ్యారని వెల్లడి
- వాళ్లను చూడాలనిపిస్తుంటుందని వివరణ
తారా మాస్టర్... తెలుగు చిత్రసీమలో మహిళా కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. అగ్రహీరోల చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. గత కొంతకాలంగా ఆమె నుంచి కబుర్లేమీ వినిపించలేదు. అయితే, ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూ ద్వారా తారా మాస్టర్ మరోసారి తెరపైకి వచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె అనేక ఆసక్తికర అంశాలను వెల్లడించారు.
"గతంతో పోల్చితే నేను బరువు తగ్గాను. నా ఆరోగ్యం ఇప్పుడు బాగుంది. చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున వంటి హీరోలతో మాట్లాడదామని ప్రయత్నిస్తుంటాను. అదేంటో గానీ, వాళ్లు విదేశాల్లో ఉన్నప్పుడే నేను ఫోన్లు చేస్తుంటాను. దాంతో వాళ్లు ఇంట్లో లేరన్న సమాధానం వినిపిస్తుంది. బహుశా వాళ్లు విదేశాలకు వెళ్లిన విషయం నాకు తెలియక ఆ సమయంలో ఫోన్లు చేస్తుంటానేమో!
బాలకృష్ణ, రామ్ చరణ్... వీళ్లందరినీ చూడాలనిపిస్తుంటుంది. రామ్ చరణ్ ను ఒకట్రెండేళ్ల వయసప్పుడే ఒళ్లో కూర్చోబెట్టుకుని ఫొటోలు తీసుకున్నాను. అప్పుడు వాళ్లందరూ పిల్లలు.... ఇప్పుడు గ్రేట్ హీరోస్, గ్లామరస్ హీరోస్ అయ్యారు.
అప్పట్లో చిరంజీవి కశ్మీర్, సింగపూర్ లో షూటింగ్ జరిగితే కుటుంబంతో కలిసి వచ్చేవారు. వాళ్ల పిల్లలందరూ మా చుట్టూ ఉండేవాళ్లు. నాగార్జునకు పదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచీ నాకు తెలుసు. ఆ సమయంలో నేను తంగప్పన్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నాను.
అక్కినేని గారు, మేడమ్ గారు వారి ఐదుగురు పిల్లలను తీసుకుని షూటింగ్ కు వచ్చేవారు. ఆ ఐదుగురు పిల్లలు నా చుట్టూ కూర్చుని కథలు చెప్పించుకునేవాళ్లు. రాత్రి పది గంటల వరకు అలా కథలు చెప్పుకుంటూ ఉండేవాళ్లం. అన్నపూర్ణమ్మ గారు వచ్చి పిలిస్తే ఆ పిల్లలు అప్పుడు వెళ్లేవాళ్లు.
ఒక్కోసారి నాకు సపరేట్ రూమ్ ఇచ్చేవాళ్లు... లేదంటే, నాకు, లేడీ హెయిర్ డ్రస్సర్ కు కలిపి ఒక రూమ్ ఇచ్చేవాళ్లు. నాగార్జున వచ్చి ఒక కథ చెప్పండి అని అడిగేవాడు. నేనేదో పిచ్చి కథలన్నీ చెప్పేదాన్ని... ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పేదాన్ని. ఆ కథలను నాగార్జున కళ్లు పెద్దవి చేసి వినేవాడు. అదే విధంగా ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ... ఇలా అందరూ తెలుసు. అందరూ మద్రాస్ లోనే ఉండేవారు.
నాకు సొంత ఇల్లు లేదని ఒక బాధ ఉంది. అప్పట్లో సొంత ఇంటి కోసం కోర్టుకు వెళ్లాను. అది నాకు తెలియకుండా జరిగిపోయింది. ఇలా ఎందుకు చేశానా అని నా మీద నాకే అసహ్యం వేసింది. ఒకరి డబ్బుకు ఎందుకు ఆశించానా? అనిపించింది. దేవుడు ఉన్నాడు... నాకు దక్కేది అయితే అదే దక్కుతుంది.
వాళ్లు (సుందరం మాస్టర్) ఇచ్చినా కూడా తీసుకోకూడదనిపించేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. జీవితంలో చాలా ముందుకు వచ్చాను... నా జీవితంలో దేవుడే గొప్ప. వాళ్లను (ప్రభుదేవా, రాజుసుందరం) చూడాలని కూడా నేను అనుకోలేదు. నేను ఎవరినీ నిందించాలని అనుకోవడంలేదు. ఒకరిని నిందించి నన్ను నేను తగ్గించుకోలేను" అని తారా మాస్టర్ వివరించారు.