Chandrababu: త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ.... మూడు పార్టీల్లో కష్టపడిన వారికి ప్రాధాన్యం: చంద్రబాబు

Chandrababu talks about nominated posts

  • మంత్రులు, ఎమ్మెల్యేలు, గ్రామస్థాయి నేతలతో టెలీకాన్ఫరెన్స్
  • కార్యకర్తలకు ఇచ్చే ప్రమాద బీమా రూ.5 లక్షలకు పెంపు
  • 100 రోజుల్లో ఏం చేశామో ప్రజలకు వివరించాలన్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, గ్రామ స్థాయి టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని, కూటమిలోని మూడు పార్టీల్లో కష్టపడ్డ నేతలకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. 

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం అని, వారి త్యాగాలు చిరస్మరణీయం అని కొనియాడారు. కార్యకర్తలకు ఇచ్చే ప్రమాద బీమాను రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచామని వెల్లడించారు.  

పార్టీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎంపవర్‌మెంట్‌ విభాగం ద్వారా యువతకు వివిధ కంపెనీలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం ద్వారా విద్యార్థులకు శిక్షణను ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని వివరించారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారని వివరించారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకం అమలు చేస్తామని తెలిపారు.    

చంద్రబాబు వ్యాఖ్యల హైలైట్స్...

•  చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని ప్రజలు మనకు ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మన పాలన ఉండాలి.
•  గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి వ్యవస్థలను సర్వనాశనం చేసింది. 
•  నాడు వారు చేసిన పాపాలే నేడు ప్రజలకు శాపాలుగా మారాయి. 
•  జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన వల్ల జరిగిన నష్టాన్ని ప్రజా క్షేత్రంలో వివరించాలి.  
•  కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో మనం చేసిన పనులు ప్రజలకు తెలపాలి. గత పాలకులు పాపాలను ప్రజలకు తెలియజేయాలి.
•  సంక్షేమం,అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నాం. 
•  2029 నాటికి టీడీపీని తిరుగులేని శక్తిగా మారుస్తా.
•  ప్రజల సెంటిమెంట్ తోనూ ఆడుకునే స్థాయికి గత పాలకులు దిగజారారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూలో జంతువుల కొవ్వు     వినియోగించారు. 
•  దోషులను వదలబోము. నేరం చేయడం, తప్పించుకోడానికి ఎదురుదాడి చేయడం అలవాటుగా మారింది. ఇలానే వదిలేస్తే అబద్ధాలను పదేపదే చెప్పి ప్రజలను మోసం చేస్తారు. 
•  అధికారం చేపట్టగానే తిరుమల నుండే ప్రక్షాళన మొదలు పెట్టాం. తిరుమలలో గోవింద నామస్మరణ తప్ప ఏ ఇతర నినాదాలు వినిపించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. 
•  ప్రజలంతా ఇది మంచి ప్రభుత్వం అని భావిస్తున్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఖజానాలో డబ్బులు లేకపోయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా  ఉపయోగించుకుంటున్నాం. 
•  గత అసమర్థ పాలనతో ప్రభుత్వంలోని పలు విభాగాలు గాడితప్పాయి. వాటిని సరిదిద్దుతున్నాము. పెండింగ్ బిల్లులను విడుదల చేస్తూ ముందుకు పోతున్నాం. 
•  మనది ప్రజా ప్రభుత్వం... ఆర్భాటాలు లేవు. 
• 100 రోజుల్లో ఏం చేశామో ప్రజలకు చెప్పండి. నేతలు ఇంటింటికీ వెళ్లాలి. గ్రామ, వార్డు సచివాలయాలతో పార్టీ ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకోవాలి. 
• చారిత్రాత్మక విజయం అందించిన ప్రజలకు మనం సంక్షేమం, అభివృద్ధి అందించాలి.

  • Loading...

More Telugu News