Madhya Pradesh: ఆర్మీ ప్రత్యేక రైలుని పేల్చివేసే కుట్ర... ట్రాక్‌పై 10 డిటోనేటర్ల గుర్తింపు

detonators were found on a railway track in an attempt to blow up the train carrying Army personnel in Madhya Pradesh

  • మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసిన షాకింగ్ ఘటన
  • ఆర్మీ సిబ్బంది ప్రయాణించిన రైలును లక్ష్యం ఎంచుకున్న దుండగులు
  • ఉత్తరప్రదేశ్‌లో రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్ గుర్తింపు
  • వరుసగా వెలుగుచూస్తున్న కుట్రలు

దేశంలో ఇటీవల రైలు ప్రమాదాలకు కుట్రలు పన్నుతున్నట్టు అనుమానాలు కలిగించేలా వరుస ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా దిగ్భ్రాంతి కలుగజేసే మరో పన్నాగం బయటపడింది. ఆర్మీ సిబ్బందితో వెళుతున్న ప్రత్యేక రైలును పేల్చివేసే కుట్ర జరిగింది. రైల్వే ట్రాక్‌పై ఏకంగా 10 డిటోనేటర్లను దుండగులు అమర్చారు. అయితే అదృష్టం కొద్దీ ఎలాంటి నష్టం జరగకుండానే కుట్రం భగ్నమైంది. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది.

సైన్యానికి చెందిన ప్రత్యేక రైలు జమ్మూ కశ్మీర్ నుంచి కర్ణాటకకు వెళుతున్న సమయంలో సగ్‌ఫటా రైల్వే స్టేషన్ సమీపంలో డిటోనేటర్లను గుర్తించారు. ఒక డిటోనేటర్ పేలడంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై ట్రైన్‌ను ఆపాడు. దీంతో పెనుప్రమాదం తప్పింది. 

డ్రైవర్ వెంటనే స్టేషన్‌ మాస్టర్‌కు సమాచారం అందించాడు. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), రైల్వే, స్థానిక పోలీసు సీనియర్ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్

ఉత్తరప్రదేశ్‌లో ఒక చోట రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్‌ను రైల్వే భద్రతా సిబ్బంది గుర్తించారు. ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున రాష్ట్రంలోని కాన్పూర్‌లో ఉన్న ప్రేమ్‌పూర్ రైల్వే స్టేషన్‌కు సమీపంలో రైలు పట్టాలపై ఈ సిలిండర్‌ను గుర్తించారు. అది ఖాళీ గ్యాస్ సిలిండర్ అని నిర్ధారించారు. 

ట్రాక్‌పై సిలిండర్‌ను గుర్తించిన వెంటనే గూడ్స్ రైలు లోకో పైలట్ అత్యవసర బ్రేకులు వేసి ట్రైన్‌ను ఆపాడు. ఉదయం 8:10 గంటల సమయంలో ట్రైన్ కాన్పూర్ నుంచి ప్రయాగ్‌రాజ్‌ వైపు వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. 5 కేజీల గ్యాస్ సిలిండర్‌ను ట్రాక్‌పై ఉంచారని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో ఈ తరహా ఘటన జరగడం ఈ నెలలో రెండవసారి కావడం గమనార్హం.

More Telugu News