Rajnath Singh: కేంద్ర మంత్రి హెలికాఫ్టర్ కు ఇంధనం కొరత.. రోడ్డు మార్గంలో ప్రయాణించిన రాజ్ నాథ్
--
రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెలికాఫ్టర్ ఇంధనం కొరతతో నిలిచిపోయింది. దీంతో చేసేదేంలేక కేంద్ర మంత్రి రోడ్డు మార్గంలో ప్రయాణించారు. బీజేపీ చేపట్టిన పరివర్తన్ ర్యాలీలో భాగంగా రాజ్ నాథ్ సింగ్ శనివారం ఝార్ఖండ్ లోని గఢ్వాల్ కు చేరుకున్నారు. అక్కడ సభలో ప్రసంగించిన తర్వాత మంత్రి ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే, హెలికాఫ్టర్ లో ఇంధనం అయిపోయిందని సిబ్బంది చెప్పారు. ఇంధనం తీసుకువస్తున్న ట్యాంకర్ సమయానికి అక్కడికి చేరుకోలేదన్నారు. దీంతో సుమారు గంటసేపు ఎదురుచూసిన రాజ్ నాథ్ సింగ్.. ఆ తర్వాత కారులోనే వారణాసికి బయలుదేరారు.
పరివర్తన్ సభ జరిగిన గఢ్వాల్ లోని బంశీదర్ నగర్ నుంచి వారణాసికి సుమారు 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ తో ఆ సమయంలో మరో మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఉన్నారు. కాగా, మంత్రి రాజ్ నాథ్ హెలికాఫ్టర్ కు ఇంధన కొరత ఏర్పడడంపై అధికారులు స్పందించారు. కేంద్ర మంత్రి ఉపయోగించిన హెలికాఫ్టర్ ఓ ప్రైవేటు సంస్థదని ఝార్ఖండ్ డీజీపీ వివరణ ఇచ్చారు. ఇంధనం తీసుకొస్తున్న ట్యాంకర్ మార్గమధ్యలో నిలిచిపోవడంతో ఈ ఇబ్బంది కలిగిందని తెలిపారు.