Kakinada: వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యం .. సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ సీరియస్
- కాకినాడ రంగరాయ వైద్య కళాశాల వైద్యుడిపై చేయి ఎత్తిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ
- ఆయన సమక్షంలో వైద్యుడిపై చేయి చేసుకున్న ఆనుచరులు
- ఎమ్మెల్యేపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైద్య కళాశాల ప్రిన్సిపాల్
- ఘటనపై క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే పంతం నానాజీ
కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) వైద్యుడు డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దౌర్జన్యం చేయడం, ఆయన దుర్భాషలాడటం తీవ్ర సంచలనం అయ్యింది. వైద్యుడు ఉమామహేశ్వరరావుపై ఎమ్మెల్యే పంతం నానాజీ 'చంపేస్తా.. నన్ను తిట్టాల్సిన పనేంటి నీకు, చదువుకునే కుర్రాలను రెచ్చగొడతావురా' అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే అనుచరులు డాక్టర్ ఉమామహేశ్వరరావుపై చేయి చేసుకున్నారు. 'నేనేమీ అనలేదండీ' అంటూ డాక్టర్ ఉమామహేశ్వరరావు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా వినకుండా వైద్యుడి ముఖానికి ఉన్న మాస్క్‌ను లాగి కొట్టడానికి ఎమ్మెల్యే చేయి ఎత్తారు. ఇంతలో ఆయన అనుచరుడు వైద్యుడిపై చెయ్యి చేసుకున్నాడు.
కళాశాల క్రీడా మైదానంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వాలీబాల్ ఆడేందుకు వైద్య కళాశాల క్రీడా మైదానంలోకి బయటి వ్యక్తులు రాగా, కళాశాల యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కొందరు ఎమ్మెల్యే వద్దకు వెళ్లి వైద్యులు మిమ్మల్ని దూర్భాషలాడుతున్నారని, మైదానంలో ఆడనివ్వడం లేదని తెలిపారు. దీంతో ఆయన శనివారం రాత్రి కళాశాల క్రీడా మైదానానికి వెళ్లి డాక్టర్ ఉమామహేశ్వరరావును అసభ్య పదజాలంతో దూషించారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డీఎంఈ డాక్టర్ నరసింహం ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం రాత్రి ఆర్‌ఎంసీకి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే నానాజీ జరిగిన ఘటనపై క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.