Hezbillah Military: ఇజ్రాయెల్ తడాఖా... హిజ్బుల్లాలో అందరూ అయిపోయారు... ముగ్గురు తప్ప!
- హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ వరుస దాడులు
- ఇబ్రహీం అకీల్ సహా కీలక నేతలు హతం
- సంస్థ చీఫ్ నస్రల్లా, ఆలీ కరాకీ (సదరన్ ఫ్రంట్ కమాండర్), అబూ ఆలీ రిదా (బేడర్ యూనిట్ కమాండర్) లు మాత్రమే మిగిలి ఉన్నారని వెల్లడి
లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలటరీ స్థావరాలపై ఇజ్రాయెల్ తడాఖా ఝుళిపించింది. వరుస దాడులతో విరుచుకుపడటంతో కీలక కమాండర్లు హతమయ్యారు. ఇబ్రహీం అకీల్ సహా కీలక నేతలను మట్టుబెట్టడం ద్వారా హిజ్ బుల్లా సైనిక వ్యవస్థ దాదాపు విచ్చిన్నమైందని ఇజ్రాయిల్ ప్రకటించింది. బీరుట్ పై శుక్రవారం చేపట్టిన క్షిపణుల దాడుల్లో దాదాపు 37 మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో హిజ్బూల్లా నెం.2 ఇబ్రహీం అకీల్‌తో పాటు కీలక కమాండర్ అహ్మద్ మహ్మద్ వాహ్బీ ఉన్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
హిజ్బుల్లా అధిపతి హసన్ నస్రల్లాతో పాటు ఎనిమిది మంది కీలక సైనిక కమాండర్లతో కూడిన మిలిటరీ చైన్ ఆఫ్ కమాండ్ ఫోటోను ఐడీఎఫ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టు చేసి.. వీరిలో ఇప్పటి వరకూ ఆరుగురిని మట్టుబెట్టినట్లు తెలిపింది. అకీల్, ఫాద్ ఘక్ర్ , విస్సమ్ ఆల్ తావిల్, అబు హసన్ సమీర్, తాలెబ్ సమీ అబ్దుల్లా, మహమ్మద్ నాసర్‌లు హతమైన వారిలో ఉన్నారని, సంస్థ చీఫ్ నస్రల్లా, ఆలీ కరాకీ (సదరన్ ఫ్రంట్ కమాండర్), అబూ ఆలీ రిదా (బేడర్ యూనిట్ కమాండర్) లు మాత్రమే మిగిలి ఉన్నట్లు వెల్లడించింది. తమ పౌరులకు హాని కలిగించే ఉగ్రశక్తులపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేసింది.