Haryana Assembly Elections: వినేశ్ ఫోగాట్, బబితా ఫోగాట్ మధ్య మాటల యుద్ధం
- హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్ ఫోగాట్ వర్సెస్ బబిత ఫోగాట్
- అక్కా చెల్లెళ్ల మధ్య మాటల యుద్దం
- ఈసారి హస్తం దెబ్బ గట్టిగా పడుతుందని వ్యాఖ్యానించిన వినేశ్ ఫోగాట్
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే క్రమంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరి జులానా నియోజకవర్గ అభ్యర్ధిగా బరిలో నిలిచిన రెజ్లర్ వినేశ్ ఫోగాట్ .. ఆమె కజిన్ సిస్టర్, బీజేపీ నాయకురాలు బబితా ఫోగాట్ మధ్య మాటల యుద్దం జరుగుతోంది. వినేశ్ ఫోగాట్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఇప్పటికే బబిత కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో వినేశ్ ఫోగాట్ చేసిన సంచలన వ్యాఖ్యలపై బబిత ఘాటుగా స్పందించారు.
ఈసారి ఎన్నికల్లో హస్తం దెబ్బ గట్టిగా తగులుతుందని బీజేపీని ఉద్దేశించి వినేశ్ ఫోగాట్ అన్నారు. 'ఈసారి కాంగ్రెస్ చేతి చిహ్నం చెంప దెబ్బలా పని చేస్తుంది. అక్టోబర్ 5న ఈ చెంపదెబ్బ ఢిల్లీలో కొట్టబడుతుంది' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకురాలు బబితా ఫోగాట్ ఘాటుగా స్పందించారు. సంకుచిత స్వభావం గలవారే ఇలాంటి కామెంట్స్ చేస్తారన్నారు. ఇలాంటి కామెంట్స్ చేసే ముందు వినేశ్ పునరాలోచించాలని కోరారు.
హర్యానాలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుండగా, 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే .. బీజేపీలో బబితా ఫోగాట్ ఎంతో కాలం నుండి ఉన్నా ఆమెకు టికెట్ దక్కలేదు. కానీ వినేశ్ ఫోగాట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే టికెట్ లభించింది. వినేశ్ ఫోగాట్ కాంగ్రెస్ పార్టీలో చేరికతో వారి కుటుంబంలో చీలిక వచ్చింది.