Kaleshwaram Project: మేడిగడ్డ బ్యారేజీ 3, 4, 5 బ్లాక్‌లలో సమస్యలు ఉన్నాయి: ఇంజినీర్లు
- బ్యారేజీల నాణ్యత, ధృవీకరణకు సంబంధించి ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్
- కమిషన్ ఎదుట హాజరైన పదిమంది ఇంజినీర్లు
- అఫిడవిట్ల ఆధారంగా ఇంజినీర్లను ప్రశ్నించిన కమిషన్
మేడిగడ్డ బ్యారేజీ 3, 4, 5 బ్లాక్‌లలో సమస్యలు ఉన్నాయని ఐఐటీ బృందం తెలిపిందని, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకున్నప్పటికీ ఇది పరిష్కారం కాలేదని ఇంజినీర్లు చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు చేపట్టిన పనుల నాణ్యత, నాణ్యతా పరీక్షలు, ధృవీకరణకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సంబంధిత ఇంజినీర్లను ప్రశ్నించింది.
ఈ కాళేశ్వరం కమిషన్ ఎదుట క్వాలిటీ కంట్రోల్ విభాగానికి చెందిన పదిమంది ఇంజినీర్లు హాజరయ్యారు. కమిషన్ ఎదుట దాఖలైన అఫిడవిట్ల ఆధారంగా ఇంజినీర్లను ప్రశ్నించింది.
విచారణ సందర్భంగా ఇంజినీర్లు పలు అంశాలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. మేడిగడ్డ ఆనకట్ట అంచనా వ్యయం పెరుగుదల, బ్యాంకు గ్యారెంటీలు, కుంగుబాటు గురించి ఎస్ఈ, ఈఈలను కమిషన్ ప్రశ్నించింది. మేడిగడ్డలోని పలు బ్లాకుల్లో సమస్యలు ఉన్నట్లు ఐఐటీ బృందం గుర్తించిందని తెలిపారు. తగిన చర్యలు తీసుకున్నప్పటికీ పరిష్కారం కాలేదని తెలిపారు.
అంచనా వ్యయం పెంపు, బ్యాంకు గ్యారెంటీలకు సంబంధించిన ప్రశ్నలకు వారి నుంచి సమాధానం రాలేదు. అన్నారం డిజైన్ సరిగా లేదని సంబంధిత ఈఈ వెల్లడించారు. వరదలను సెకనుకు ఐదు మీటర్లు తట్టుకునేలా రూపొందిస్తే 18 మీటర్ల వరకు వరద వస్తోందని ఇంజినీర్లు వెల్లడించారు. అన్నారం బ్యారేజీ అలైన్‌మెంట్ సరిగ్గా లేకపోవడంతో సమస్యలు వస్తున్నట్లు తెలిపారు.