Mohan Babu: తల్లడిల్లిపోయాను... నేరస్తులను కఠినంగా శిక్షించాలని నా ఆత్మీయుడు చంద్రబాబును కోరుతున్నా: మోహన్ బాబు
- తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వును కలపడంపై మోహన్ బాబు స్పందన
- ఇలా జరగడం ఘోరం, హేయం, నీచమని వ్యాఖ్య
- చంద్రబాబు నూరేళ్లు చల్లగా ఉండాలన్న మోహన్ బాబు
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉందనే ఆరోపణలపై సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. ఈ వార్త వినగానే ఒక భక్తుడిగా తాను తల్లడిల్లిపోయానని చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందువు ఎంతో భక్తితో పూజించే కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి అని పేర్కొన్నారు. 3 నెలల క్రితం వరకు స్వామివారి లడ్డూలో జంతువుల కొవ్వును కలుపుతున్నారని తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని వెల్లడించారు. స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, అత్యంత నీచం, హేయం, అరాచకమని తెలిపారు
స్వామివారి లడ్డూలో జంతువుల కొవ్వును కలపడం నిజమైతే నేరస్తులను కఠినంగా శిక్షించాలని తన మిత్రుడు, ఆత్మీయుడు, సీఎం చంద్రబాబును హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని వివరించారు. కలియుగదైవం శ్రీనివాసుడి ఆశీస్సులను తన మిత్రుడు అందుకుని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
మోహన్ బాబు యూనివర్శిటీ నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని చూసి తనతో పాటు వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.