Chandrababu: తిరుమల ఆలయం సెట్టింగ్ ను ఇంట్లో వేసుకున్న వారిని ఏమనాలి?: సీఎం చంద్రబాబు
- మీడియాతో ఏపీ సీఎం చంద్రబాబు చిట్ చాట్
- తిరుమల లడ్డూ వివాదంపై వ్యాఖ్యలు
- శ్రీవారి లడ్డూ తయారీకి రివర్స్ టెండర్లేంటని ఆగ్రహం
మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ వ్యవహారంపై స్పందించారు. తిరుమల శ్రీవారికి నైవేద్యం పెట్టే పరమ పవిత్రమైన లడ్డూ తయారీకి రివర్స్ టెండర్లేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి జగన్ ఎలా సర్టిఫికెట్ ఇస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. తిరుమల ఆలయం సెట్టింగ్ ను ఇంట్లో వేసుకున్న వారిని ఏమనాలి? అంటూ ఎత్తిపొడిచారు. ఆచారాలను, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని హితవు పలికారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమలపై దృష్టి సారించామని... టీటీడీని ప్రక్షాళన చేయాలని కొత్త ఈవోకు చెప్పానని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక లడ్డూ నాణ్యత పెంచి, పలు కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగిందని చంద్రబాబు వివరించారు. లడ్డూ నాణ్యత పెంచడం కోసం నందిని సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేశారని తెలిపారు.
ప్రక్షాళన చేయమని చెప్పడం ఆలస్యం... అన్ని పనులు చకచకా చేసేశారని టీటీడీ ఈవో శ్యామలరావును అభినందించారు. ఇవన్నీ ఆయన ప్రతి రోజూ బయటికొచ్చి చెప్పుకోలేదని... ఈవోగా తన పని తాను చేసుకుంటూ పోయారని కితాబిచ్చారు.
టీటీడీ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనేది చర్చిస్తున్నామని... జీయర్లు, కంచి పీఠాధిపతులు, సనాతన ధర్మ పండితులతో చర్చిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సంప్రోక్షణ తీరుతెన్నులు ఎలా ఉండాలో సలహాలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో నాణ్యత పరీక్షలు, సంప్రోక్షణ చేపట్టాలనుకుంటున్నామని... ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నామని వివరించారు.