Tirumala Laddu: తిరుపతి లడ్డు ప్రసాదం వివాదం ఎఫెక్ట్: ప్రసాదం నాణ్యతపై రాజస్థాన్ ప్రభుత్వం ప్రత్యేక క్యాంపెయిన్
- తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల అవశేషాలు ఉన్నాయన్న ఆరోపణ
- రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాన్ని పరీక్షించాలని రాజస్థాన్ నిర్ణయం
- ఇందుకోసం ప్రత్యేకంగా బృందం ఏర్పాటు
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఆలయాల్లో సమర్పించే భోగం, ప్రసాదం నాణ్యతను పరీక్షించాలని ఫుడ్ సేఫ్టీ విభాగం సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి 26 వరకు రాష్ట్రంలోని అన్ని ఆలయాలను తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రసాదం నమూనాలు సేకరించి పరీక్షలకు పంపనుంది.
ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఇందుకోసం ప్రత్యేకంగా ‘శుద్ధ్ ఆహార్, మలీవత్ పర్ వార్’ అనే ప్రచారం ప్రారంభించింది. ఇందులో భాగంగా రోజూ ప్రసాదం తయారుచేసే పెద్దపెద్ద ఆలయాల్లోనూ విచారణ జరపనున్నట్టు ఆహార భద్రత విభాగాపు అదనపు కమిషనర్ పంకజ్ ఓఝా తెలిపారు. ఇందులో భాగంగా ప్రసాదానికి ఉపయోగించే వివిధ పదార్థాల నాణ్యతను తనిఖీ చేస్తారు. రాష్ట్రంలో 54 ఆలయాలు ఇప్పటి వరకు భోగ్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ప్రసాదం నాణ్యతను పరీక్షించడంతోపాటు పరిశుభ్రతను కూడా పరీక్షిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు.