TTD: తిరుమలలో రోజుకు 3 లక్షల లడ్డూల తయారీ.. సరుకులు ఎలా కొంటారంటే..!
- అలిపిరి నుంచి తిరుపతి వరకు 2 ఎకరాలలో గోడౌన్లు
- రోజుకు 1,400 కిలోల నెయ్యి వినియోగం
- లడ్డూల తయారీకి టీటీడీకి ఏటా రూ.500 కోట్ల ఖర్చు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూలలో కల్తీపై రేగిన వివాదం భక్తులను ఆందోళన పరుస్తోంది. స్వామి వారి లడ్డూ అపవిత్రమైందని భక్తులు కలత చెందుతున్నారు. ఈ క్రమంలో తిరుమలలో శ్రీవారి ప్రసాదం లడ్డూను ఎలా తయారు చేస్తారు.. అవసరమైన పదార్థాలను ఎలా సేకరిస్తారు.. తదితర వివరాలు ఇదిగో..
తిరుమలలో సగటున రోజుకు 3 లక్షల లడ్డూలు తయారుచేస్తారని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఏటా 6,100 టన్నుల నెయ్యి, 14 టన్నుల చక్కెర, 9,200 టన్నుల శనగ పప్పు, 4,680 టన్నుల మైసూర్ పప్పులతో పాటు సన్ ఫ్లవర్ ఆయిల్, బాదాం తదితర పదార్థాలను ఈ టెండర్ ద్వారా సేకరిస్తారు. అలిపిరి నుంచి తిరుపతి వరకు రెండు ఎకరాల్లో విస్తరించిన గోడౌన్లలో వీటిని నిల్వ చేస్తారు. వీటికోసం టీటీడీ ఏటా రూ.500 కోట్లు ఖర్చుచేస్తోంది.
ఈ టెండర్..
లడ్డూల తయారీకి అవసరమైన పదార్థాలను సేకరించేందుకు ఈ టెండర్ ద్వారా సరఫరాదారులను ఎంపిక చేస్తారు. ఇందులో పాల్గొనాలంటే ఏపీ టెక్నలాజికల్ సర్వీసెస్ ధ్రువీకరించిన సంస్థలకు మాత్రమే అవకాశం ఉంటుంది. అగ్ మార్క్, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ తప్పనిసరి.
వివాదం ఇదీ..
లడ్డూల తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనేది తాజా వివాదం.. టీటీడీ రోజూ తయారుచేసే 3 లక్షల లడ్డూల కోసం 1,400 కిలోల నెయ్యి ఉపయోగిస్తుంది. టీటీడీకి వచ్చే నెయ్యి ట్యాంకర్లను నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ లేబరేటరీస్ (ఎన్ఏబీఎల్) ముందుగా పరీక్షిస్తుంది. ఆ తర్వాతే ట్యాంకర్లు టీటీడీ గోడౌన్ కు చేరతాయి. ఇటీవల ఏఆర్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సప్లై చేసిన 10 ట్యాంకర్లను టెస్టింగ్ అధికారులు ఆపేశారు.
అందులో కల్తీ జరిగిందనే అనుమానంతో శాంపిల్స్ ను పరీక్షకు పంపించి, ట్యాంకర్లను పక్కన పెట్టారు. అయితే, ఏఆర్ డెయిరీ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. వివిద దశలలో పరీక్షించాకే టీటీడీకి నెయ్యి పంపించామని చెబుతోంది. టీటీడీకి సప్లై చేసే నెయ్యిలో తాము పంపించేది కేవలం 0.01 శాతం మాత్రమేనని వివరించింది.