Yashasvi Jaiswal: టెస్టుల్లో యశస్వి జైస్వాల్ మరో సంచలన ఫీట్.. తొలి భారతీయ బ్యాటర్‌గా నయా రికార్డ్!
- తన మొదటి 10 టెస్టు మ్యాచ్‌లలో కలిపి యశస్వి ఇప్పటివరకు 1094 రన్స్
- తొలి 10 మ్యాచుల్లో 1000 కంటే ఎక్కువ రన్స్ చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా యశస్వి
- ఈ రికార్డు గతంలో సునీల్ గవాస్కర్ (978 పరుగులు) పేరిట
- ఈ జాబితాలో 1,446 పరుగులతో అగ్రస్థానంలో డాన్ బ్రాడ్‌మాన్
టీమిండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ టెస్టుల్లో తనదైన డ్యాషింగ్ ఆటతో దూసుకెళ్తున్నాడు. వరుస శతకాలు, అర్ధ శతకాలు నమోదు చేయడంతో పాటు పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ క్రమంలో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇప్పటికే తన 10 మ్యాచుల చిన్న టెస్ట్ కెరీర్లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో బాగానే ఆకట్టుకున్నాడు.
ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లోనూ యశస్వి ఓ అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 56 పరుగులు చేసిన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో పెద్ద స్కోరు చేయడంలో విఫలమయ్యాడు. కేవలం 10 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. అయితే, ఈ చిన్న స్కోర్ కూడా అతడికి భారీ మైలురాయిని అందించడం విశేషం. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు ఏ భారతీయ క్రికెటర్‌కు సాధ్యంకాని ఫీట్‌ను యశస్వి సొంతం చేసుకున్నాడు.
తన మొదటి 10 టెస్టు మ్యాచ్‌లలో కలిపి యశస్వి ఇప్పటివరకు 1094 పరుగులు చేశాడు. ఇలా ఏ భారతీయ బ్యాటర్ కూడా ఇప్పటివరకూ తమ మొదటి 10 మ్యాచుల్లో ఇన్ని రన్స్ చేయలేదు. దీంతో తొలి 10 మ్యాచుల్లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు గతంలో సునీల్ గవాస్కర్ (978 రన్స్) పేరిట ఉంది.
ఇక ఆస్ట్రేలియన్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ తన మొదటి 10 మ్యాచులలో 1,446 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
మొదటి 10 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు..
1,446 పరుగులు - డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా)
1,125 పరుగులు - ఎవర్టన్ వీక్స్ (వెస్టిండీస్)
1,102 పరుగులు - జార్జ్ హెడ్లీ (వెస్టిండీస్)
1,094 పరుగులు - యశస్వి జైస్వాల్ (భారతదేశం)
1,088 పరుగులు - మార్క్ టేలర్ (ఆస్ట్రేలియా)
ఇక చెన్నై వేదికగా బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. శుక్రవారం రెండో రోజు ఆటలో టీమిండియానే పైచేయి సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. దీంతో భారత్ ఆధిక్యం 308 పరుగులకు చేరింది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రత్యర్థి బంగ్లాను రోహిత్ సేన 149 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో భారత్‌కు 227 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక రెండోరోజు ఆట ముగిసే సమయానికి శుభ్‌మన్ గిల్ (33 బ్యాటింగ్), రిషబ్ పంత్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.