Jio: బీఎస్ఎన్ఎల్ కు పెరుగుతున్న యూజర్లు
- జులై నెలలో చార్జీలను పెంచిన టెలికాం కంపెనీలు
- లక్షలాది వినియోగదారులను కోల్పోయిన ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, జియో సంస్థలు
- బీఎస్ఎన్ఎల్‌కు పెరిగిన 29 లక్షల మంది యూజర్లు
టెలికాం చార్జీల పెంపు నిర్ణయంతో ప్రైవేటు టెలికాం కంపెనీలకు యూజర్లు షాక్ ఇస్తున్నారు. ఇంతకు ముందు వరకూ ప్రతి నెలా బీఎస్ఎన్ఎల్, వొడా ఫోన్ ఐడియా యూజర్‌లు తగ్గుతుండగా, ఆ మేర జియో, ఎయిర్‌టెల్ యూజర్లు పెరగడం కనిపించింది. అయితే ఈ ఏడాది జులై నెలలో టెలికాం చార్జీల పెంపు నిర్ణయం ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్‌కు లాభదాయకంగా మారింది. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా తమ కస్టమర్లను కొంతమందిని కోల్పోయాయి. ఇదే సమయంలో బీఎస్ఎన్ఎల్ యూజర్లు పెరిగారు. జులై నెలకు సంబంధించి ట్రాయ్ వెలువరించిన డేటాలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ సంవత్సరం జులై మొదటి వారంలో ప్రైవేటు టెలికం సంస్థలైన జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా 10 నుండి 27 శాతం మేర ధరలు పెంచాయి. ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలైతే ప్రారంభ ప్లాన్ ధరలను దాదాపు రెట్టింపు చేశాయి. ఈ క్రమంలో సదరు కంపెనీల యూజర్ల సంఖ్య తగ్గడం జరిగింది. ఎయిర్ టెల్ 16 లక్షల మంది యూజర్లను కోల్పోగా, వొడాఫోన్ ఐడియా 14 లక్షలు, జియో 7.5 లక్షల యూజర్లు తమ నెట్ వర్క్ మార్చుకున్నారు. అదే సమయంలో బీఎస్ఎన్ఎల్ కు 29 లక్షల మంది యూజర్లు పెరిగారు.