Tirumala: శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం... చంద్రబాబుకు బండి సంజయ్ లేఖ
- ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం ఆందోళన కలిగిస్తోందన్న సంజయ్
- హిందూ సమాజం మనోభావాలను తీవ్రంగా కలచివేస్తోందన్న బండి సంజయ్
- లడ్డూ వ్యవహారంలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ఆందోళన
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయమై ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఇది క్షమించరాని నేరం అన్నారు. ఈ అంశంపై సీబీఐ విచారణ కోరాలన్నారు. ఈ లడ్డూ ప్రసాదం వ్యవహారం శ్రీవారి భక్తకోటిని, యావత్ హిందూ సమాజం మనోభావాలను తీవ్రంగా కలచివేస్తోందన్నారు.
లడ్డూ వ్యవహారంలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ఆందోళన వ్యక్తం చేశారు. అన్యమత ప్రచారం జరుగుతోందని గతంలో ఫిర్యాదులు వచ్చినప్పటికీ నాటి పాలకులు పట్టించుకోలేదన్నారు. ఎర్రచందనం కొల్లగొడుతూ ఏడు కొండలవాడిని రెండు కొండలకే పరిమితం చేశారని చెప్పినా స్పందించలేదన్నారు. జంతువుల కొవ్వును లడ్డూ ప్రసాదంలో వినియోగించారని మీరు చేసిన వ్యాఖ్యలతో... కల్తీ జరిగినట్లుగా హిందూ సమాజం భావిస్తోందన్నారు.
లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును వినియోగించడం అత్యంత నీచమని, దీనిని హిందూ ధర్మంపై జరిగిన భారీ కుట్రగా భావిస్తున్నామని పేర్కొన్నారు. లడ్డూ ప్రాముఖ్యతను తగ్గించడం ద్వారా టీటీడీపై కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని సడలించేందుకు కుట్ర చేశారన్నారు. ఇది క్షమించరాని నేరం అన్నారు. అన్యమతస్తులకు టీటీడీ బాధ్యతలు అప్పగించడం, ఉద్యోగాల్లో అవకాశం కల్పించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు.
ఉన్నతస్థాయి వ్యక్తుల ప్రమేయం లేకుండా ఏళ్లుగా కల్తీ దందా జరిగే అవకాశం ఉండదన్నారు. సీబీఐతో విచారణ జరిపిస్తే నిజాలు నిగ్గు తేలుతాయని, అయితే అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు.