YS Jagan: తిరుమల లడ్డూ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ స్పందన

Fat in the ghee used in making Tirumala Laddu is a lie says EX CM YS Jagan

  • నెయ్యిలో జంతువుల కొవ్వు అనేది కట్టుకథ అని ఖండించిన వైసీపీ అధినేత
  • దశాబ్దాలుగా జరుగుతున్న పద్దతుల్లోనే తిరుమలలో లడ్డూ తయారీ జరుగుతోందని వ్యాఖ్య
  • ఒక ముఖ్యమంత్రి ఇలా అబద్ధాలు ఆడటం ధర్మామేనా అని విమర్శలు

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ వ్యవహారంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనేది ఒక కట్టు కథ అని కొట్టిపారేశారు. దశాబ్దాలుగా జరుగుతున్న పద్దతుల్లోనే తిరుమలలో లడ్డూ తయారీ జరుగుతోందని అన్నారు. 

దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుది అని విమర్శించారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? అని ఆయన ప్రశ్నించారు.

ప్రతి 6 నెలలకు ఒకసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారని, జులై 23న రిపోర్ట్ వస్తే ఇప్పుడు చంద్రబాబు మాట్లాడడం విడ్డూరం అని మండిపడ్డారు.

ఎప్పటిలాగా ఒకే విధానంలో లడ్డూ తయారీ సామగ్రి కొనుగోలు ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్ష విధానాలను ఎవరూ మార్చలేదని, ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా అని అన్నారు. ఒక సీఎం ఇలా అబద్ధాలు ఆడటం ధర్మామేనా అని జగన్ మండిపడ్డారు. 

జులై 17న ఎన్‌డీడీబీకి నెయ్యి శాంపిల్స్ పంపించారని, జులై 23న రిజెక్ట్ చేస్తే చంద్రబాబు ఇప్పటివరకు ఏం చేశారు?. ఎందుకు బయటకు చెప్పలేదని ప్రశ్నించారు. జరగనిది జరిగినట్టు చంద్రబాబు చెబుతున్నారని జగన్ పేర్కొన్నారు. నెయ్యి తీసుకొచ్చే ప్రతి ట్యాంకర్ సర్టిఫికెట్ తీసుకోవాలని, ప్రతి ట్యాంక్ శాంపిళ్లను మూడుసార్లు టెస్ట్ చేస్తారని వివరించారు.

అబద్ధాలను ప్రచారం చేయడం ద్వారా తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. మన తిరుమలను మనమే తక్కువ చేసుకుంటున్నామని అన్నారు. లడ్డూ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీకి, సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తానని అన్నారు. 100 రోజుల పాలనపై ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ వ్యవహారం అని అన్నారు.

కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనపై మండిపాటు

మరోవైపు సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనపై జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వంద రోజుల పాలన అంతా మోసమేనని వ్యాఖ్యానించారు. 

"సూపర్ సిక్స్ లేదు... సెవెనూ లేదు. వ్యవస్థలన్నీ తిరోగమనంలో ఉన్నాయి. గోరు ముద్ద గాలికి ఎగిరిపోయింది. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు వసతి దీవెన, విద్యా దీవెన కూడా ఇవ్వలేదు. 108, 104 ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు. డైవర్షన్ పాలిటిక్స్‌లో చంద్రబాబు దిట్ట. వరదలు వస్తాయని అప్రమత్తత ఉన్నా రివ్యూ చేయలేదు’’ అని జగన్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News