YS Sharmila: వైసీపీలో జగన్ తప్ప ఎవరూ మిగలరు... తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు చిన్న విషయం కాదు: షర్మిల

Sharmila demands CBI probe in Tirumala laddu case
  • సజ్జల, విజయసాయిరెడ్డి కూడా వైసీపీలో ఉండరన్న షర్మిల
  • తిరుమల లడ్డూ విషయంపై చంద్రబాబు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్న
  • జగన్ హయాం నాటి కాంట్రాక్టరే ఇప్పటికీ నెయ్యి సరఫరా చేస్తున్నారని షర్మిల
ముఖ్యమంత్రిగా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంచి పేరు సంపాదించుకున్నారని... జగన్ మాత్రం చెడ్డ పేరు తెచ్చుకున్నారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. వైసీపీ విశ్వసనీయతను కోల్పోయిందని చెప్పారు. 

ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను జగన్ మోసం చేశారని విమర్శించారు. విశాఖలోని రుషికొండపై కూడా కబ్జాలు చేశారని మండిపడ్డారు. వైఎస్సార్ తో జగన్ కు ఏమాత్రం పోలిక లేదని అన్నారు. వైసీపీలో జగన్ తప్ప ఎవరూ మిగలరని జోస్యం చెప్పారు. సజ్జల, విజయసాయిరెడ్డి కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారని అన్నారు.

తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును వినియోగించడం చిన్న విషయం కాదని షర్మిల అన్నారు. జగన్ హయాంలో ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇప్పటికీ నెయ్యి సరఫరా చేస్తున్నారని చెప్పారు. జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఇంత పెద్ద విషయాన్ని సీఎం చంద్రబాబు ఎందుకు లైట్ గా తీసుకున్నారని ప్రశ్నించారు. 

లడ్డూ నాణ్యతపై రిపోర్ట్ వచ్చి చాలా రోజులు అవుతున్నా... దానిపై చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని అడిగారు. లడ్డూకు ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని ఆయన నిన్ననే చెప్పారని... ఈ విషయాన్ని ఇన్ని రోజులు చెప్పకుండా ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించారు. 

కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నివేదికను బయట పెట్టారా? అని నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు నివేదిక గురించి మాట్లారా? అని ప్రశ్నించారు. లడ్డూ అంశంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై రాష్టర గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
YS Sharmila
Congress
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News