Bengal Doctors: కోల్‌కతా వైద్య విద్యార్థుల ఆందోళన విరమణ.. కీలక ప్రకటన!
![Bengal Doctors End Cease Work To Resume Essential Duties From Saturday](https://imgd.ap7am.com/thumbnail/cr-20240920tn66eccc95bb3d3.jpg)
- 41 రోజుల తర్వాత ఆగిన కోల్‌కతా వైద్య విద్యార్థుల ఆందోళన
- శనివారం నుంచి అత్యవసర సేవల్లో పాల్గొంటామని ప్రకటన
- బెంగాల్ ప్రభుత్వంతో రెండు దఫాల చర్చల అనంతరం విద్యార్థుల నిర్ణయం
- పలు డిమాండ్లను అంగీకరించిన బెంగాల్ సర్కార్
కోల్‌కతా ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టిన ఆర్‌జీ కర్ వైద్య విద్యార్థులు 41 రోజుల తర్వాత ఆందోళన విరమించారు. రేపటి (శనివారం) నుంచి అత్యవసర సేవల్లో పాల్గొంటామని తెలిపారు.
బెంగాల్ ప్రభుత్వంతో రెండు దఫాల చర్చల అనంతరం వైద్య విద్యార్థులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం మమతా బెనర్జీతో వారి చర్చలు సఫలం కావడంతో విద్యార్థులు నిరసనలను విరమిస్తున్నట్లు ప్రకటించారు. వారి పలు డిమాండ్లకు ముఖ్యమంత్రి అంగీకరించారు. దీనిలో భాగంగా కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను తప్పించి ఆయన స్థానంలో మనోజ్ కుమార్ వర్మకు బాధ్యతలు అప్పగించారు.
అలాగే మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కౌస్తవ్ నాయక్, హెల్త్ సర్వీస్ డైరెక్టర్ దేవాశిష్ హల్డేర్‌లను వారి పోస్టుల నుంచి తొలగించడం జరిగింది. ఇక వైద్య విద్యార్థులు రెండో దఫాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో బుధవారం భేటీ అయ్యారు. అనంతరం తమ ఆందోళన విరమణ ప్రకటన చేశారు.
"మా నిరసన విరమిస్తున్నాం. ఈ కేసును త్వరగా విచారించాలని కోరుతూ గురువారం మధ్యాహ్నం సీబీఐ ఆఫీస్‌కు ర్యాలీ చేపడుతున్నాం. వరదల కారణంగా ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. రోగులకు వైద్య సేవలు అందించడానికి శనివారం నుంచి విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నాం. అత్యవసర సేవల్లో పాల్గొంటాం. అయితే, కోల్‌కతాలోని అన్ని మెడికల్ కాలేజీల వద్ద ధర్నా మంచాస్ అలాగే కొనసాగుతాయి" అని ఓ డాక్టర్ చెప్పుకొచ్చారు.