Ravichandran Ashwin: భారత్-బంగ్లా టెస్టు.. ముగిసిన తొలి రోజు ఆట.. సెంచరీతో కదం తొక్కిన రవిచంద్రన్ అశ్విన్
- తొలి రోజు 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు సాధించిన భారత్
- ఆదుకున్న అశ్విన్-జడేజా జోడి
- 86 పరుగులతో కదంతొక్కిన రవీంద్ర జడేజా
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగింపు సమయానికి భారత్ 6 వికెట్లు నష్టపోయి 339 పరుగులు సాధించింది. తొలి రోజు ఆటలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ సాధించడం హైలైట్ గా నిలిచింది.
అశ్విన్ తన కెరీర్ లో, అది కూడా సొంతగడ్డపై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. అదిరిపోయే రేంజ్‌లో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో ఆల్‌రౌండర్ రూపంలోకి మారిపోయే అశ్విన్ కేవలం 108 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతడికిది టెస్టుల్లో
6వ సెంచరీ కావడం విశేషం. కాగా చెన్నైలో అశ్విన్‌కు ఇది రెండవ టెస్టు సెంచరీ.
టెస్టుల్లో భారత్ తరుపున 6 సెంచరీలు సాధించిన ఎంఎస్ ధోనీ, మన్సూర్ అలీ ఖాన్ పటౌడీల సరసన ఇప్పుడు అశ్విన్ కూడా చేరాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో సెంచరీ సాధించడం ద్వారా, తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని అశ్విన్ మరోసారి నిరూపించుకున్నాడు.
ఇక భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 56, రోహిత్ శర్మ 6, శుభ్‌మాన్ గిల్ 0, విరాట్ కోహ్లీ 6, రిషబ్ పంత్ 39, కేఎల్ రాహుల్ 16 చొప్పున పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో జత కట్టి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆట ముగిసే సమయానికి అశ్విన్ 102 పరుగులతో, రవీంద్ర జడేజా 86 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహ్మద్ 4 వికెట్లు, నహీద్ రానా, మెహదీ హసన్ చెరో వికెట్ తీశారు.