Mossad: ‘డెడ్లీ ఫోన్ కాల్’ నుంచి పేజర్ పేలుళ్ల దాకా.. మొసాద్ కీలక ఆపరేషన్లు ఇవే..!

Exploding Pagers To Spraying Poison A Look At Covert Israeli Ops

  • నిఘా, గూఢచర్యంలో తిరుగులేని ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ
  • పక్కాగా ప్లాన్ చేసి ప్రపంచంలో ఎక్కడైనా సరే పని పూర్తిచేస్తుందంటున్న నిపుణులు
  • ఇజ్రాయెల్ శత్రువులు ఏ దేశంలో దాక్కున్నా తుదముట్టించేస్తుందట

లెబనాన్ లో హిజ్బుల్లా సభ్యులు వాడుతున్న పేజర్లు, వాకీటాకీలు ఒక్కసారిగా పేలి 32 మంది చనిపోగా 3 వేల మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు కారణం ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ కారణమని లెబనాన్ ఆరోపిస్తోంది. అంతర్జాతీయంగా అందరి చూపూ మొసాద్ వైపే ఉంది. గాజాపై ఇజ్రాయెల్ దాడి, పాలస్తీనియన్లకు హిజ్బుల్లా మద్దతు తదితర కారణాలతో ఈ పని చేసింది మొసాద్ ఏజెంట్లేనని అంతా అభిప్రాయపడుతున్నారు. వేల సంఖ్యలో పేజర్లు, వాకీటాకీలు ఒక్కసారిగా పేలడానికి, అలా పేల్చడానికి మొసాద్ ఏజెంట్లు ఎంత పక్కాగా ప్లాన్ చేసి ఉంటారనేదానిపై పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా మొసాద్ పనితీరుకు, ముందస్తు ప్లానింగ్ కు నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు.

సెల్ ఫోన్లు వాడితే ఇజ్రాయెల్ నిఘా పరికరాలు పట్టేస్తాయని హిజ్బుల్లా సభ్యులు పేజర్లు, వాకీటాకీలు ఉపయోగించడం మొదలుపెడితే.. వాటిని ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు, లెబనాన్ కు ఎలా చేరుతున్నాయనేది ఆరా తీసి, ఆ పేజర్లు తయారయ్యే కంపెనీలోనే వాటిలో పేలుడు పదార్థాలను నింపి, అవి హిజ్బుల్లా సభ్యులకు చేరాక వాటిని పేల్చివేయడం మొసాద్ సుదీర్ఘ ప్లానింగ్ కు నిదర్శనం. ఇజ్రాయెల్ కు శత్రువు ఎవరైనా, ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా పక్కాగా ప్లాన్ చేసి మొసాద్ వారిని తుదముట్టిస్తుందని పేరు పొందింది. మొసాద్ నిర్వహించిన ఇలాంటి ఆపరేషన్లు మరికొన్ని..

డెడ్లీ ఫోన్ కాల్..
హమాస్ ఉగ్రవాద సంస్థలో కీలక సభ్యుడు, బాంబుల తయారీలో ‘ఇంజనీర్’ గా పేరొందిన యహ్యా అయ్యాష్ ను తుదముట్టించేందుకు మొసాద్ పన్నిన ప్లాన్ ‘డెడ్లీ ఫోన్ కాల్’.. 1996లో గాజాలో దాక్కుని ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న యహ్యా అయ్యాష్ ను తుదముట్టించేందుకు మొసాద్ ఓ ఫోన్ ను పేలుడు పదార్థాలతో ప్రత్యేకంగా తయారుచేసింది. హమాస్ ఏజెంట్ ద్వారా ఆ ఫోన్ ను యహ్యా అయ్యాష్ కు చేరేలా ప్లాన్ చేసింది. తన తండ్రితో మాట్లాడేందుకు యహ్యా అయ్యాష్ ఆ ఫోన్ ను ఉపయోగించగా.. ఫోన్ కాల్ ట్రాప్ చేసిన మొసాద్ ఏజెంట్లు ఆ వాయిస్ ను గుర్తించి ఫోన్ ను పేల్చేశారు. దీంతో యహ్యా అయ్యాష్ చనిపోయాడు.

నెక్ పాయిజన్..
1997లో హమాస్ సూసైడ్ బాంబింగ్ దాడులు పెరిగిపోయాయి. దీనికి చెక్ పెట్టేందుకు హమాస్ కీలక నేత ఖలీద్ మాషాల్ ను అంతం చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మొసాద్ ను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఇద్దరు అండర్ కవర్ ఏజెంట్లు.. జోర్డాన్ లో తలదాచుకున్న ఖలీద్ సమీపంలోకి వెళ్లి ఆయన వీపుపై విషాన్ని ప్రయోగించారు. పనిపూర్తయ్యాక తప్పించుకునే క్రమంలో ఇద్దరూ జోర్డాన్ పోలీసులకు పట్టుబడ్డారు. ఖలీద్ కు చేసిన విషప్రయోగానికి ఇజ్రాయెల్ విరుగుడు ఇచ్చాకే జోర్డాన్ పోలీసులు మొసాద్ ఏజెంట్లను వదిలిపెట్టారు.

ఫేక్ టూరిస్టులు..
2010లో దుబాయ్ లోని ఓ హోటల్ రూంలో అంతర్జాతీయ ఆయుధ వ్యాపారి, హమాస్ కు ఆయుధాలు సప్లై చేసే మహమూద్ అల్ మభౌహ్ చనిపోయాడు. తొలుత ఇది సహజ మరణంగా భావించిన దుబాయ్ పోలీసులు.. ఇజ్రాయెల్ ఏజెంట్లే ఆయనను హత్య చేశారని హమాస్ ఆరోపించడంతో దర్యాఫ్తు జరిపారు. సీసీటీవీ ఫుటేజీలో మొసాద్ ఏజెంట్లు మారుపేర్లతో, టెన్నిస్ ప్లేయర్ల వేషంలో టూరిస్టులుగా వచ్చి మభౌహ్ కు మత్తుమందిచ్చి చంపేశారని తేలింది. ఆ హోటల్ లోనే పలువురు మొసాద్ ఏజెంట్లు పనివాళ్ల వేషంలో ఉంటూ మభౌహ్ కదలికలను ఎప్పటికప్పుడు గమనించి హత్యకు ప్లాన్ చేశారని దుబాయ్ పోలీసులు గుర్తించారు.

ట్రాఫిక్ పేలుళ్లు..
2010 నుంచి 2020 మధ్య కాలంలో ఇరాన్ కు చెందిన అణు శాస్త్రవేత్తలు ఆరుగురు హత్యకు గురయ్యారు. కొంతమంది తుపాకీ కాల్పులకు, మరికొంతమంది పేలుళ్లలో దుర్మరణం పాలయ్యారు. శాస్త్రవేత్తలు ప్రయాణిస్తున్న కార్లను మొసాద్ ఏజెంట్లు బైక్ లపై వెంటాడారు. అవకాశం చిక్కగానే మాగ్నెటిక్ బాంబులను శాస్త్రవేత్తల కార్లకు అంటించి వెళ్లిపోయారు. కొంతదూరం ప్రయాణించాక ఆ బాంబులు పేలడంతో శాస్త్రవేత్తలు చనిపోయారు. చాలావరకు పేలుళ్లు ఇలాగే జరిగాయని ఇరాన్ పోలీసులు చెప్పారు. ఈ హత్యలకు ఇజ్రాయెల్ ఏజెంట్లే కారణమని ఇరాన్ ఆరోపించింది.

శాటిలైట్ స్నిపర్..
ఇరాన్ చీఫ్ న్యూక్లియర్ సైంటిస్ట్ మొహసెన్ ఫఖ్రిజాదెహ్ హత్యలో మొసాద్ ఏజెంట్లు శాటిలైట్ ద్వారా నియంత్రించే స్నిపర్ గన్ ను వాడారని ఇరాన్ ఆరోపించింది. 2020లో ఫఖ్రిజాదెహ్ పటిష్ట సెక్యూరిటీ మధ్య టెహ్రాన్ లో ప్రయాణిస్తుండగా ఈ దాడి జరిగింది. సెక్యూరిటీ కాన్వాయ్ మధ్యలో తన కారులో కూర్చున్న ఫఖ్రిజాదెహ్ ను ఓ పికప్ ట్రక్ లో అమర్చిన స్నిపర్ గన్ ద్వారా మొసాద్ ఏజెంట్లు తుదముట్టించారు. ఈ గన్ ను ఏఐ టెక్నాలజీ ఉపయోగించి శాటిలైట్ ద్వారా నియంత్రించారని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ హత్య తమపనేనని ఇజ్రాయెల్ ఇప్పటికీ అంగీకరించలేదు.

  • Loading...

More Telugu News