India vs Bangladesh: చెన్నై టెస్టు.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

Bangladesh chose to field

  • చిదంబరం స్టేడియం వేదికగా భార‌త్‌, బంగ్లా మ‌ధ్య తొలి టెస్టు
  • టాస్ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన బంగ్లా
  • స‌ర్ఫ‌రాజ్ స్థానంలో బ‌రిలోకి కేఎల్ రాహుల్ 
  • పాక్‌ను వైట్‌వాష్ చేసి, ఊపులో ఉన్న బంగ్లా టైగ‌ర్స్‌
  • భార‌త్‌పై కూడా గెలిచి స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లు

చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియం వేదికగా భార‌త్‌తో జ‌రుగుతున్న‌ తొలి టెస్టులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ముగ్గురు పేస‌ర్లు జ‌స్ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ఆకాశ్ దీప్‌ల‌తో బ‌రిలోకి దిగింది. చాలా కాలం త‌ర్వాత కేఎల్ రాహుల్ టెస్టు జ‌ట్టులోకి తిరిగొచ్చాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో రాణించిన యువ ఆట‌గాడు స‌ర్ఫ‌రాజ్ బెంచ్‌కే ప‌రిమితమ‌య్యాడు. అత‌ని స్థానంలోనే రాహుల్‌ను తీసుకున్నాడు కెప్టెన్ రోహిత్‌. 

అలాగే వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడ‌లేక‌పోయిన విరాట్ కోహ్లీ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు. మిగతా జ‌ట్టులో పెద్ద‌గా మార్పు చేయ‌లేదు. అటు ఇటీవ‌ల పాకిస్థాన్‌లో ముగిసిన టెస్టు సిరీస్‌ను వైట్‌వాష్ చేసిన బంగ్లా జ‌ట్టు.. రోహిత్ సేన‌పై కూడా విజ‌యం సాధించి స‌త్తా చాటాల‌ని చూస్తోంది. దీంతో ఈ సిరీస్ ర‌స‌వ‌త్తరంగా కొన‌సాగుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  

ఇక సుమారు 6 నెలల విరామం తర్వాత టీమిండియా సొంతగడ్డపై టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ ఏడాది ఆరంభంలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఓడించిన తర్వాత రోహిత్‌ సేన ఆడనున్న తొలి టెస్టు ఇదే. ఇరు జ‌ట్లు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడ‌నున్నాయి. రెండో టెస్టు కాన్పూర్‌లో జ‌ర‌గ‌నుంది. 

భార‌త జ‌ట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్‌ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), రవీంద్ర జడేజా, ర‌విచంద్ర‌న్‌ అశ్విన్, జస్ప్రీత్‌ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.

బంగ్లా జ‌ట్టు: షాద్‌మన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్ (వికెట్ కీప‌ర్‌), మెహిదీ హసన్ మిరాజ్, హసన్ మహమూద్, నహిద్ రానా, తస్కిన్ అహ్మద్.

  • Loading...

More Telugu News