YSR Law Nestham: మరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం
- ఏపీలో ప్రభుత్వ పథకాలకు కొనసాగుతున్న పేరు మార్పు ప్రక్రియ
- 'వైఎస్ఆర్ లా నేస్తం' పథకాన్ని 'న్యాయ మిత్ర'గా మార్పు
- ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్ల మార్పు ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా వైఎస్ఆర్ లా నేస్తం పథకం పేరును న్యాయ మిత్రగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి (ఎఫ్ఏసీ) వి. సునీత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను త్వరలో జారీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యాయ మిత్ర పథకం ద్వారా జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ అందించనున్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అంతకు ముందున్న పథకాల పేర్లను మార్చిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలకు వైఎస్ఆర్, జగనన్న పేర్లు పెట్టి కొనసాగించారు. ఇప్పుడు జగన్ హయాంలో పథకాలకు ఉన్న పేర్లను కూటమి ప్రభుత్వం మార్పు చేస్తొంది.
ఈ క్రమంలో ఇప్పటికే జగనన్న విద్యాకానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా, జగనన్న గోరు ముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా, జగనన్న ఆణిముత్యాలు పథకాన్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా, వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా, వైఎస్ఆర్ విద్యా వసతి పేరును ఎన్టీఆర్ విద్యావసతిగా, జగన్ సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరును సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకాలుగా, జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్షణ పథకాన్ని ఏపీ రీ సర్వే ప్రాజెక్టుగా కూటమి సర్కార్ పేర్లను మార్పు చేసింది.