Kakkathoppu Balaji: చెన్నైలో కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ కాల్చివేత
- 50కి పైగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న కక్కతోప్పు బాలాజీ ఎన్ కౌంటర్
- అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై దాడి
- కాల్చి చంపిన పోలీసులు
- ఇటీవల కాలంలో రెండో ఎన్ కౌంటర్ చేసిన గ్రేటర్ చెన్నై పోలీసులు
పెద్దయితే నువ్వేం అవుతావు అంటూ విద్యార్థులను టీచర్లు అడగడం సాధారణమైన విషయం. అందుకు స్టూడెంట్లు బదులిస్తూ... కలెక్టర్ ను అవుతాననో, పోలీస్ అధికారి అవుతాననో, విమాన పైలెట్ అవుతాననో, క్రికెటర్ అనో... ఇలా తమ భవిష్యత్ ప్రణాళికల గురించి చెబుతుంటారు.
కానీ, ఓ కుర్రాడు మాత్రం తాను రౌడీ అవుతానని టీచర్ తో చెప్పడమే కాదు, అయ్యాడు కూడా. కానీ, చివరికి పోలీసుల చేతిలో హతమయ్యాడు. అతడి పేరు కక్కతోప్పు బాలాజీ.
చెన్నైలో కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ గా పేరుమోసిన కక్కతోప్పు బాలాజీ కథ ఇవాళ వేకువజాముతో ముగిసింది. 50కి పైగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న బాలాజీని పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చి చంపారు.
గ్రేటర్ చెన్నై పోలీసులు ఓ కేసులో బాలాజీని అరెస్ట్ చేసేందుకు వైసర్పాడి వెళ్లారు. అయితే పోలీసుల రాకను గమనించిన ఆ గ్యాంగ్ స్టర్ మారణాయుధాలతో వారిపై దాడికి యత్నించాడు. దాంతో పోలీసులు కాల్పులు జరపడంతో అతడు మరణించాడు.
ఇటీవల కాలంలో గ్రేటర్ చెన్నై పోలీసులు చేపట్టిన రెండో ఎన్ కౌంటర్ ఇది. తమిళనాడు బీఎస్పీ చీఫ్ కె.ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న నేరస్తుడు తిరువెంగడం కూడా జూన్ 14న పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. ఆధారాల సేకరణ కోసం తిరువెంగడంను పోలీసులు మాధవరం చెరువు వద్దకు తీసుకువచ్చిన సమయంలో ఆ ఎన్ కౌంటర్ జరిగింది. చేతులకు బేడీలు తీయగానే, తిరువెంగడం పోలీసులపై కాల్పులు జరపడంతో అతడు కుప్పకూలాడు.
ఇప్పుడు కక్కతోప్పు బాలాజీ కూడా పోలీసుల చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి పైకప్పు తొలగించి ఇంట్లో ప్రవేశించి ప్రత్యర్థులను హతమార్చిన చరిత్ర బాలాజీ సొంతం. అతడిపై నమోదైన కేసుల్లో ఎనిమిది హత్య కేసులు ఉన్నాయి.