AP DGP: హీరోయిన్ జెత్వానీ కేసులో లోతైన విచారణ జరగాల్సి ఉంది: ఏపీ డీజీపీ

AP DGP on actress Jetwani case

  • జెత్వానీ కేసులో ప్రాథమిక విచారణ పూర్తయిందన్న డీజీపీ
  • ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని వ్యాఖ్య
  • ధైర్యంగా పని చేసేలా పోలీసులను సంసిద్ధం చేస్తున్నామన్న డీజీపీ

ముంబయి హీరోయిన్ కాదంబరి జెత్వానీ కేసు ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 

మరోవైపు ఈ అంశంపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందిస్తూ... జెత్వానీ కేసులో ప్రాథమిక విచారణ పూర్తయిందని... ఈ కేసులో ఇంకా లోతైన విచారణ జరగాల్సి ఉందని చెప్పారు. 

ప్రజలకు మెరుగైన సేవలు అందిచడమే తమ లక్ష్యమని అన్నారు. లైంగిక దాడులను నివారించడం కోసం ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నామని చెప్పారు. ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

పోలీసులు ధైర్యంగా పని చేసేలా వారిని సంసిద్ధం చేస్తున్నామని డీజీపీ చెప్పారు. పోలీసుల సంక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. పోలీస్ క్యాంటీన్ల వర్కింగ్ కేపిటల్ కింద రూ. 4.7 కోట్లు ఇచ్చామని చెప్పారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

ప్రస్తుతం విజయవాడ, విశాఖలో మాత్రమే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని... అన్ని జిల్లా కేంద్రాల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను అరికట్టడానికి యాంటీ నార్కోటిక్స్ విభాగానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. విధి నిర్వహణలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ముందుకు సాగుతామని చెప్పారు. చిన్నపిల్లలు, బాలికలపై జరగుతున్న లైంగిక దాడులను అందరూ కలిసి అరికట్టాల్సిన అవసరం ఉందని డీజీపీ తెలిపారు.

  • Loading...

More Telugu News