CV Anand: గణేశ్ శోభాయాత్రపై హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్

CV Anand on Ganesh Immersion

  • ఉదయం 5 గంటలకు చివరి భాగం ఎంజే మార్కెట్‌కు చేరుకుందన్న సీపీ
  • గత ఏడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితి మరింత మెరుగుపడిందని వెల్లడి
  • 25 వేలమంది పోలీసులు రెండు షిఫ్టుల్లో పని చేశారన్న సీవీ ఆనంద్

భాగ్యనగరంలో గణేశ్ శోభాయాత్ర చివరి భాగం ఈరోజు ఉదయం 5 గంటలకు ఎంజే మార్కెట్‌కు చేరుకుందని హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గణేశ్ నిమజ్జనంపై ఆయన మాట్లాడుతూ... నిమజ్జనం కార్యక్రమం త్వరగా పూర్తి చేసేందుకు 25 వేలమంది పోలీసులు నిర్విరామంగా కృషి చేశారన్నారు.

సిబ్బంది రెండు షిఫ్ట్‌ల్లో పని చేసినట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితి మరింత మెరుగ్గా ఉందన్నారు. నిమజ్జనం దాదాపు చివరికి చేరుకుందని, ఈరోజు ఉదయం 9 గంటల వరకు దాదాపు అన్ని రోడ్లు కూడా సాధారణ ట్రాఫిక్ వెళ్లేందుకు వీలుగా అందుబాటులోకి వస్తాయన్నారు.

మరోవైపు, హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్ వద్ద వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం వరుస కట్టాయి. అర్ధరాత్రి నుంచి వేలాది వినాయక విగ్రహాలు వరుసలో బారులు తీరాయి. హుస్సేన్ సాగర్ వద్ద మధ్యాహ్నం సమయానికి విగ్రహాలు పూర్తిగా నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

నిమజ్జనం నేపథ్యంలో 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో సాగర్ చుట్టూ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య పనులు చేపడుతోంది. నగరంలోని వివిధ చెరువుల్లో ఇప్పటి వరకు 1 లక్ష 3,500 గణనాథుల నిమజ్జనాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా మూసాపేట ఐడీఎల్ చెరువులో 26,546, ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గం వద్ద 4,730, నెక్లెస్ రోడ్ వద్ద 2,360, పీపుల్స్ ప్లాజా వద్ద 5,500,  అల్వాల్ కొత్తచెరువులో 6,221 వినాయక విగ్రహాల నిమజ్జనాలు జరిగినట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తంలో 71 ప్రాంతాల్లో నిమజ్జనాలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News