Edible Oils: అప్పటి వరకు సరిపడా నిల్వలు ఉన్నాయి... వంట నూనె ధరలు పెంచవద్దు: కేంద్రం

Centre advises edible oil associations

  • దిగుమతి సుంకాన్ని అదనుగా తీసుకొని ధరలు పెంచవద్దని సూచన
  • మరో 50 రోజుల స్టాక్ ఉందని వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
  • రైతుల ప్రయోజనం కోసం సుంకాన్ని పెంచిన కేంద్రం

నాలుగైదు రోజులుగా వంట నూనెల ధరలు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. నూనె ధరలు పది శాతానికి పైగానే పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో వినియోగదారులు నూనెను కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ధరలు ఇంకా పెరుగుతాయా? తగ్గే అవకాశం ఉందా? అని వ్యాపారులు కూడా ఆందోళనలో ఉన్నారు. 

ఇందుకు ప్రధాన కారణం వంట నూనెలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచడమే కారణం. దీంతో దిగుమతులు తగ్గి దేశీయ మార్కెట్లో నూనె ధరలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నూనె ధరలపై సంబంధిత అసోసియేషన్లకు కీలక సూచనలు  చేసింది.

దిగుమతి సుంకం పరిస్థితిని అదనుగా తీసుకొని వంట నూనెల ధరలు పెంచవద్దని సంబంధిత సంస్థలకు కేంద్రం సూచించింది. తక్కువ సుంకానికి ఇప్పటికే దిగుమతి చేసుకున్న వంట నూనెల నిల్వలు సరిపడా మొత్తం మన వద్ద ఉన్నాయని మోదీ ప్రభుత్వం వెల్లడించింది. మన వద్ద దాదాపు 30 లక్షల టన్నుల స్టాక్ ఉందని, ఈ స్టాక్ మరో 45 నుంచి 50 రోజులకు సరిపోతుందని తెలిపింది. కాబట్టి ధరలు పెంచవద్దని సూచించింది.

చౌక దిగుమతుల కారణంగా మన దేశంలో నూనె గింజల ధరలు పడిపోతున్నాయి. దీంతో మన దేశంలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైతులకు ప్రయోజనం కలిగించేందుకు కేంద్రం ఇటీవల వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. ముడి పామాయిల్, సోయాబిన్, సన్ ఫ్లవర్ నూనెపై ఇప్పటి వరకు దిగుమతి సుంకం లేదు. 

అయితే మన రైతులకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ఈ నూనెలపై దిగుమతి సుంకాన్ని 20 శాతానికి పెంచింది. పామాయిల్, సన్ ఫ్లవర్‌ ఆయిల్ పై 12.5 శాతం నుంచి 32.5 శాతానికి పెంచింది. వీటిపై అగ్రికల్చర్ సెస్ కూడా వర్తిస్తుంది. ఈ క్రమంలో ధరలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News