HYDRA: సుప్రీంకోర్టు బుల్డోజర్ న్యాయం ఆదేశాలు హైడ్రాకు వర్తించవు: కమిషనర్ రంగనాథ్
- అప్పటికప్పుడు బుల్డోజర్ ద్వారా చేసే న్యాయం వద్దన్న సుప్రీంకోర్టు
- చెరువులను ఆక్రమించిన నిర్మాణాలను కూల్చేస్తున్నామన్న రంగనాథ్
- హైడ్రా నేరస్తులు, నిందితుల ఆస్తుల జోలికి వెళ్లడం లేదని స్పష్టీకరణ
అప్పటికప్పుడు బుల్డోజర్ న్యాయం చేయడంపై ఇవాళ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో హైడ్రాకు వర్తించవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు విచారణలో ఉన్న నేరగాళ్ళ ఇళ్లు, ప్రైవేటు ఆస్తుల పైకి బుల్డోజర్లను పంపిస్తున్నాయి. అయితే అప్పటికప్పుడు బుల్డోజర్ ద్వారా చేసే న్యాయం సరికాదని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
తెలంగాణలో చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుపై రంగనాథ్ స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు హైడ్రాకు వర్తించవని తెలిపారు. యూపీలోని నేరస్థులు, నిందితుల ఇళ్ల కూల్చివేతలకు మాత్రమే ఆ ఆదేశాలు వర్తిస్తాయన్నారు. చెరువుల, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మించిన వాటిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తోందని వెల్లడించారు.
నేరస్తుల, నిందితులకు సంబంధించిన ఆస్తుల జోలికి హైడ్రా వెళ్ళడం లేదన్నారు. బహిరంగ స్థలాలు, రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణల తొలగింపులో తమ ఆదేశాలు వర్తించవని సుప్రీంకోర్టు స్వయంగా తెలిపిందని వెల్లడించారు. కాబట్టి ఈ ఆదేశాలు హైడ్రాకు వర్తించవన్నారు.